calender_icon.png 28 October, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్యం నుంచి రక్షించేందుకే మూసీ పునరుజ్జీవం

28-10-2024 12:18:49 AM

మూసీ పరివాహక ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ చామల 

యాదాద్రి భువనగిరి, అక్టోబరు27(విజయక్రాంతి): మూసీలో కాలుష్యంతో దుర్భర జీవితాలు గడుపుతున్న నదీ పరీవాహక ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకే ప్రక్షాళన జరిపి, నదికి పునరుజ్జీవనానికి చర్యలు తీసుకుంటున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూ డూరు మండలం మానాయికుంట మూసీ బ్రిడ్జి వద్ద నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో  ఆయన మాట్లాడుతూ.. మూసీ నదిని పూర్వపు స్థితికి తీసుకొచ్చి.. భవిషత్ తరలాను కాపాడుకునే ప్రయత్నానికి అందురూ సహకరించాలని కోరారు.

మురికికూపంలో బతుకుతున్న ప్రజలకు దారి చూపడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తుంటే తమ దరిద్రపు ఆలోచ నలతో విషప్రచారానికి ఒడిగట్టారన్నారు.

ప్రజల అభిప్రాయం మేరకు హైదరాబాద్ నగరానికి బెంగుళూరు, చెన్నై పరిస్థితులు రాకుండా ముందుచూపుతో ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. దీపావళి తర్వాత నకిరేకల్‌లో, చివరగా ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మలిదశ ఉద్యమంలో అమరుడు శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ, నాయకులు జ్ఞాన సుందర్, పేలేబోయిన లింగయ్య, సమరంరెడ్డి, వంగాల సత్యనారాయణ, యుగంధర్, పద్మ పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి

మూసీ పరీవాహక ప్రాంత రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఆత్మీయ సమావేశం కోసం అడ్డగూడూరు మండలం మానాయికుంట మూసీ బ్రిడ్జ్జిపై వేసిన తాత్కాలిక వేదికను ఆదివారం తెల్లవారుజామున చరణ్ అనే యువకుడు బైక్‌తో ఢీకొట్టగా తీవ్రగాయాలై మృతిచెందాడు.

బ్రిడ్జిపై  కాంగ్రెస్ సభ కోసం వేదిక వేశారనే విషయం గమనించకుండా.. సాధారణంగా రాకపోకలు సాగుతున్నాయని భావించిన యువకుడు బైక్‌పై వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ వేదికను బ్రిడ్జిపై నుంచి తొలగించారు.