calender_icon.png 18 October, 2024 | 5:03 AM

మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం

18-10-2024 02:38:04 AM

  1. పదేళ్లు బందిపోటు దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు 
    1. ఇప్పుడు పునరుజ్జీవనానికి మోకాలడ్డు
    2. డీపీఆర్ కోసం రూ.141కోట్లతో ఐదు కంపెనీలతో ఒప్పందం 
    3. 18 నెలల్లో డీపీఆర్ సమర్పించేలా ఎంవోయూ
    4. అవసరమైతే మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు 
    5. యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని పార్టీలకు సూచన
    6. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

* అద్దాల మేడల కోసం, అందమైన భామల కోసం మేం మూసీ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇది కొందరు దుబాయ్ వెళ్లి అందం కోసం జుట్లు నాటించుకోవడం లాంటి కార్యక్రమం కాదు.

* మూసీ పునరుజ్జీవానికి ప్రపంచంలోనే అత్యుత్తమ కట్టడాలను చేపట్టిన ప్రముఖ కంపెనీలతో రూ.141 కోట్లతో ఒప్పందం చేసుకున్నం. ఈ ఐదు కంపెనీలను కలిపి ఒక కన్షార్షియంగా ఏర్పాటు చేసినం. వీటిని టెండర్ ద్వారా ఆహ్వానించాం.

* మూసీ బఫర్ జోన్‌లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తాం. దీనిపై చర్చించేందుకు మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, వేముల ఘాట్.. ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి రెడీ. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికైనా వస్తా. 

* మూసీ పునరుజ్జీవంపై మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు ఇదే నా సవాల్. హరీశ్, కేటీఆర్, ఈటల ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి. వీరికి ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశిస్తున్నా. వారికి అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం భరిస్తుంది. ఈ ముగ్గురు నేతలు మూడు నెలలు అక్కడ ఉండగలిగితే నేను మూసీ ప్రాజెక్టును విరమించుకుంటా.

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): మూసీపై ప్రతిపక్షాలు మెదడులో విషం నింపుకొని మాట్లాడుతున్నాయని, సుందరీకరణ చేస్తున్నామని దానికి రూ.1.5లక్షల కోట్లు ఖర్చు అవుతాయని తప్పుడు ప్ర చారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తమ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయట్లేదని, నదిని పునరుజ్జీవింపజేస్తుందని సీఎం ప్రకటించారు. పదేళ్లు బంది పోటు దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని.. ఇప్పుడు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయి నిరాశ, నిస్పృహలతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూ సీకి సుందరీకరణ అంటూ కాస్మోటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారని  దుయ్యబట్టారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మూసీ పునరుజ్జీవ కార్యచరణను సీఎం ప్రకటించారు. ప్రపంచంతో పోటీపడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు.

దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే మూసీ పునరుజ్జీవ కార్యాచరణను తమ సర్కారు ప్రారంభించిందని చెప్పారు. ఇప్పటికే 33 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. అక్కడి ప్రజలు దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్నాయని ఆ బృందాలు గుర్తించినట్లు చెప్పారు. వారికి అన్ని రకాలు సదుపాయాలు, ఉపాధిని కల్పించి ఆదుకోవాలన్నదే తమ సర్కారు లక్ష్యమని స్పష్టంచేశారు.

ఆ ముగ్గురు పాలసీలే దేశాన్ని నడిపించాయి..

విద్య, నీటిపారుదల రంగాల్లో జవహర్‌లాల్ నెహ్రూ విప్లవం తీసుకొచ్చారని, దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని, పెట్టుబడుల సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన దార్శనికుడు పీవీ నరసింహారావు అని.. ఈ ముగ్గురు మాజీ ప్రధానుల హయాంలో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ ముగ్గురు ప్రవేశపెట్టిన పాలసీలను కూడా నాడు కొందరు వ్యతిరేకించారన్నారు. అయితే ఆ పాలసీలే తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన విధానాల వల్లే ప్రపంచంతో భారత్ పోటీ పడే స్థాయికి ఎదిగిందని వివరించారు. 

అందాల భామల కోసం పనిచేయట్లేదు.. 

పునరుజ్జీవనాన్ని అడ్డుకొని హైదరాబాద్ నగరాన్ని మూసీలో ముంచుతారా? అని ప్రతిపక్షాలపై సీఎం విరుచుకుపడ్డారు. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే తమ ప్రయత్నమన్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న ఆలోచనతోనే తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

తన స్వార్థం కోసం మూసీ ప్రాజెక్టును చేపడుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అద్దాల మేడల కోసం, అందమైన భామల కోసం తాము మూసీ ప్రాజెక్టును చేపట్టలేదని స్పష్టం చేశారు. ఇది కొందరు దుబాయ్ వెళ్లి అందం కోసం జుట్లు నాటించుకోవడం లాంటి కార్యక్రమం కాదని చురకలు అంటించారు.

పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కోసం తాము పని చేస్తున్నట్లు వెల్లడించారు. మూసీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మూసీని వదిలేసి చరిత్రహీనులుగా మిగిలిపోదల్చుకోలేదని సీఎం వెల్లడించారు.

ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్న ఉద్దేశంతోనే తాము ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవనం అనే గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అసూయ, ద్వేషంతో కొందరు సృష్టించే అపోహలను నమ్మొద్దని హితవు పలికారు.

గుర్రాలతో తొక్కించి ఖాళీ చేయించలేదా? 

మూసీ పరీవాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ.. వారిని తగిన నష్టపరిహారం ఇస్తూ.. తరలించాలనేదే తమ అలోచన అని సీఎం పేర్కొన్నారు. దీనిపై బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. మూసీ ప్రాంతంలో ప్రభుత్వం ఒక్క పెల్ల కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. ఎవరికి బలవంతంగా తరలించలేదన్నారు.

దసరా నేపథ్యంలో సంతోషంగా 240 ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్లారని, వారికి దారి ఖర్చుల కోసం రూ.25,000 కూడా ఇచ్చామన్నారు. ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించామన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులను దుర్మార్గంగా రాత్రికి రాత్రి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్రాలతో తొక్కించి ఖాళీ చేయించిందని మండిపడ్డారు.

కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లోని నిర్వాసితులకు ఒక్క ఇల్లు ఆయినా ఇచ్చారా అని నిలిదీశారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కానీ తాము ఆలా చేయడం లేదని పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

దీనిపై చర్చించేందుకు మల్లన్న సాగర్,రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, వేముల ఘాట్.. ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తాను కేసీఆర్ నియోజకవర్గానికే వస్తానని, అక్కడే రచ్చబండ నిర్వహిద్దామన్నారు.

నల్లగొండ విషతుల్యం

మూసీ విషం హైదరాబాద్‌నే కాదని, నల్లగొండనూ విషతుల్యం చేస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ కింద 40వేల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ కాలుష్యంతో అక్కడి రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మూసీని ప్రక్షాళన చేయకుండా నల్లగొండ ప్రాంతానికి ఎలా పునరుజ్జీవనం కలిగించాలని ప్రతిపక్షాలను నిలదీశారు.

బీఆర్‌ఎస్ మాట్లాడితే రూ.1.50లక్షల కోట్లు అని అంటున్నారని, వాళ్లలా దోచుకోవడానికి ఇదేమైనా కాళేశ్వరం అనుకున్నారా? అని చురకలు అంటించారు. డీపీఆర్‌ను రూపొందించడం కోసం రూ.141 కోట్ల ఒప్పందం మాత్రమే జరిగిందని, ఇందులో రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.

హరీశ్, కేటీఆర్, ఈటల మూసీ ఒడ్డున ఉంటారా?

మూసీ పునరుజ్జీవంపై మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హరీష్, కేటీఆర్, ఈటెల ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలని సూచించారు. వీరికి ఇండ్లు కేటాయించాలని అధికారులను కూడా ఆదేశించారు. వారికి అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఈ ముగ్గురు నేతలు మూడు నెలలు అక్కడ ఉండగలిగితే తాను మూసీ ప్రాజెక్టును విరమించుకుంటానని చెప్పారు.

24గంటల్లో ఎంక్వైరీ వేయిస్తా

వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్ ఏర్పాటుపై బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రారంభోత్సవం మాత్రమే జరిగిందన్నారు.

అలాగే, బతుకమ్మ చీరల విషయంలో గొడవ పెడుతున్న బీఆర్‌ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు రూ.10వేలు ఇచ్చారని, ఇవి లబ్ధిదారులకు సరిగా అందలేదన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవాళ్లకు ఇవ్వకుండా, మూడు, నాలుగో అంతస్తులో ఉన్నవాళ్లకు ఇచ్చారన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్, ఉన్నతాధికారులు దాన కిశోర్, అజిత్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

18 నెలల్లో మూసీపై డీపీఆర్.. 

మూసీ పునరుజ్జీవానికి ప్రపంచంలోనే అత్యుత్తమ కట్టడాలను చేపట్టిన ప్రముఖ కంపెనీలతో రూ.141కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఐదు కంపెనీలను కలిపి ఒక కన్షార్షియంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిని టెండర్ ద్వారా ఆహానించినట్లు పేర్కొన్నారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొత్తం కాలవ్యవధి ఆరున్నర ఏళ్లు అని, ఇందులో మొదటి 18 నెలల్లో ఆయా కంపెనీలు మూసీపై డీపీఆర్‌ను తయారు చేస్తాయని, ఆ తర్వాత ఐదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సీఎం చెప్పారు. డీపీఆర్ పూర్తయిన తర్వాతే మూసీ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందని, నిధులు ఎలా వస్తాయని అనే విషయాలు తెలుస్తాయని వివరించారు.

ఆరున్నరేళ్లు పాటు ఆయా కంపెనీలు  ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఈ ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శించడంపై సీఎం సీఎం స్పందించారు. ఈ ఐదు కంపెనీల్లో ఒకటైన మెయినార్హడ్.. గుజరాత్‌లోని వల్లాభాయ్ పటేల్ విగ్రహం.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, తెలంగాణలో కేసీఆర్ గురువు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రామానుజుల సమతామూర్తి విగ్రహాన్ని నిర్మించిందన్నారు. గతంలో వాళ్లు కాంట్రాక్టు ఇచ్చిన కంపెనీకే తాము ఇస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. 

ఇలాంటి నగరం దేశంలో లేదు.. 

దేశంలో నగరం మధ్య నదీ ప్రవాహం ఉన్న సిటీ హైదరాబాద్ మాత్రమే అని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి నగరం ఎక్కడా లేదన్నారు. మూసీ నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అద్భుతమైన చారిత్రక కట్టడాలను కాలగర్భంలో కలిపేయాలని కొందరు కంకణం కట్టుకు తిరుగుతున్నారని మండిప్డడారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయదలచుకున్నారా? అని నిలదీశారు. ఉప్పెనలా వరదలు వస్తే నగరమే మిగలదని హెచ్చరించారు. చెన్నై, వయనాడ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వరదలు సృష్టించిన విధ్వంసాన్ని  ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

ఇలాగే ఇటీవల ఖమ్మం జిల్లాలో సృష్టించిన వరదల విలయాన్ని కూడా వివరించారు. ఆ గుణపాఠాల నేపథ్యంలోనే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు చెప్పారు.  ఇందులో తన స్వార్థం లేదన్నారు. ఎవరినో మోసం చేసి ఏదో చేయాలన్న ఆలోచన తనకు అసలు లేదన్నారు. వరదలు వస్తే మునిగిపోకుండా ఉండడానికి హైదరాబాద్ ఏమైనా గజ్వేల్ ఫామ్ హౌసా? లేక ధరణి లాంటి మాయాజాలమా? అని చురకలు అంటించారు.

అలాగే, తాము ఎన్నేళ్లు అధికారంలో ఉంటామో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. మూసీ గర్భంలో 1600 పైచిలుకు ఇళ్లు ఉన్నాయని సీఎం చెప్పారు. అందులో 240 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దారి ఖర్చుల కోసం రూ.25,000వేలు ఇచ్చామన్నారు. 10వేల ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిన వారు సంతోషంగా ఇళ్లలోకి దసరా రోజు వెళ్లారని చెప్పారు.

అలాగే, హీరోషిమా, నాగసాకిలలో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరమని సీఎం రేవంత్ అన్నారు. ఒక తెలంగాణ కవి తన నలుగురు కూతుర్లకు గంగ, యమునా, సరస్వతీ, కృష్ణవేణి అని పేర్లు పెట్టుకున్నారని, పిల్లలకు మూసీ పేరు పెట్టుకోకపోవడానికి గత పాలకులు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఈ ద్రోహాన్ని ఇలాగే కొనసాగిద్దామా? అని నిలదీశారు. దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరంగా అభివర్ణించారు.

శనివారంలోగా యాక్షన్ ప్లాన్ ఇవ్వండి

మూసీపై ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు సీఎం రేవంత్ సూచించారు. మూసీ పరివాహక ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టంచేశారు. వారికి ఎలా ఆదుకుంటే బాగుంటుందో చెప్పాలన్నారు.

మూసీ విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నాయో తనకు రాతపూర్వరంగా పంపితే.. ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ శనివారంలోగా మూసీపై విపక్షాలు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని సీఎం కోరారు. అవసరమైతే మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి సలహాలను ఇవ్వాలన్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలను కూడా మాట్లాడే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం న్యాయ కోవిదులను కలుస్తానని చెప్పారు.

23న క్యాబినెట్ 

మూసీ ప్రాజెక్టు, అసెంబ్లీ నిర్వహణపై చర్చించే అవకాశం

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి తేదీని నిర్ణయించారు. ఈ నెల 23న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరుగనున్నది. మూసీ ప్రాజెక్టు, ధరణి, హెల్త్, రేషన్ కార్డులు తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసు కునే అవకాశముంది.

అయితే మూసీ ప్రాజెక్టు, హైడ్రా కూల్చివేతలు, బాధితులకు పునరావాసం కల్పించడం నేపథ్యంలో ఈ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. హైడ్రా చర్యలతో ప్రజల్లో పలు సందేహాలు, అపోహలు తలెత్తిన నేపథ్యంలో దీనిపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.