calender_icon.png 18 October, 2024 | 5:02 AM

మట్టి గుట్టలు మాయం!

18-10-2024 01:53:56 AM

  1. ఖమ్మంలో చెలరేగుతున్న మట్టి మాఫియా  
  2. కాసులు కురిపిస్తున్న మట్టి దందా
  3. రఘునాధపాలెం మండలంలో జోరుగా తవ్వకాలు 
  4. అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు
  5. చూసీచూడనట్టుగా అధికారయంత్రాంగం 

ఖమ్మం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అధికార పార్టీ పేరు చెప్పుకొని ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి గుట్టలను తవ్వుకుని, తరలించుకుపోతున్నా పట్టించుకునే దిక్కులేకుండాపోతుంది.

వాహనాలను పట్టుకొని, కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో మట్టి దందా మూడు ట్రిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లు అన్న చందాన సాగుతోంది. అప్పుడుప్పుడు పోలీసులు కేసుల పేరుతో హడావిడి చేయడం తప్పా గట్టి చర్యలు చేపట్టకపోవంతో మట్టి మాఫియా ఆగడాలకు   అడ్డూ అదుపూ లేకుండా పోదోందంటున్నారు. 

యథేచ్ఛగా తరలింపు

రఘునాథపాలెం మండల కేంద్రానికి సమీపంలోని గ్రామాల్లోనే కాకుండా మంచుకొండ సమీపంలోని మట్టి గుట్టలు మాఫియా చేతిలో పడి  చిక్కి శల్యమైపోతున్నాయి. కొంత మంది అనుమతుల ముసుగులో కూడా మట్టిని తరలించుకుపోతున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతులు ఎప్పుడో ముగిసినా యథేచ్ఛగా మట్టిని ఎత్తుకెళుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు గత ప్రభుత్వ హయాం నుంచే జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పేరు చెప్పుకొని, మట్టి మాఫియా చెలరేగిపోతుందని ఆరోపణలున్నాయి.

ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన మట్టి గుట్టలు ఖాళీ అయ్యాయి. అనుమతులు లేకుండానే మట్టిని దోచుకెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నా మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.