calender_icon.png 4 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి

27-01-2025 04:51:43 PM

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్...

మందమర్రి (విజయక్రాంతి): వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాలు నడిపాలని బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ పాఠశాలల వ్యాన్ డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు, పట్టణ ప్రజలకు రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సాంస్కృతిక కళా బృందాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి మాట్లాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు దాటేవారు తప్పకుండా ఒక్క క్షణం ఆగి రోడ్డు రెండు వైపుల చూసి రోడ్డు దాటాలని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.

ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. లాంగ్ డ్రైవ్ చేసే డ్రైవర్లు విశ్రాంతి ప్రదేశాలలో వాహనాలు ఆపుకొని విశ్రాంతి తీసుకుని సమయస్ఫూర్తిగా వాహనాలు నడపాలన్నారు. రాత్రి సమయంలో వాహనాలు పార్కు చేసేటప్పుడు పార్కింగ్ లైట్లు తప్పకుండా వేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాలలో రోడ్లపై వాహనాలు నిలపవద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ మజీద్, పోలీస్ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, వాహనదారులు పాల్గొన్నారు.