calender_icon.png 25 October, 2024 | 11:54 AM

అమ్మవారికి బోనం.. ఆనంద పరవశం

29-07-2024 01:42:23 AM

  1. భాగ్యనగర్‌లో బోనాల శోభ
  2. పాతబస్తీలో ఘనంగా లాల్‌దర్వాజ శ్రీమహంకాళి బోనాలు 
  3. పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు 
  4. పలు ఆలయాల్లో అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి)/చార్మినార్: నగరంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల శోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా వాడవాడల్లోని అమ్మవార్ల ఆలయాలను సుందరంగా అలంకరించారు. భాగ్యనగర్ పాతబస్తీలోని చారిత్రక లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ దేవాలయాలు, అక్కన్న మాదన్న ఆలయాలు సహా పలు ప్రాంతాల్లో బోనాల పండుగ వైభవంగా జరిగింది.

శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగం, కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అమ్మవారికి చీరసారెలు, పసుపు, కుంకుమలతో పాటు నైవేద్యాలు సమర్పించి మొక్కులు, ముడుపులు చెల్లించారు. చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ అన్నంతో చేసిన శివలింగానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శాంతి కల్యాణం చేశారు. 

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి

పాతనగరంలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున మహా అభిషేకం, పూజలు జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. మాజీ ఎంపీ టీ దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మలుల భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టువస్త్రా లను సమర్పించారు. అనంతరం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అడ్లూరి లక్ష్మణ్, రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ అమ్మవారిని దర్శించుకున్నారు. 

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..

లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బోనం సమర్పించారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, హైకోర్టు జడ్జి సూర్యపల్లి నంద బంగారు బోనం సమర్పించి దర్శించుకున్నారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత్‌రావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తదితరులు దర్శించుకున్నారు.  

పట్టువస్త్రాల సమర్పణ..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మీరాలమండి శ్రీమహంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టువస్త్రాలను సమర్పించారు. మేకలబండ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయంలో ఎంపీ ఈటల రాజేందర్, గౌలిపుర శ్రీ భారతమాత కోటమైసమ్మ ఆలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. 

ముషీరాబాద్: బోనాల సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారిని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు దర్శించుకొని పూజలు చేశారు. 

హైదరాబాద్ సిటీబ్యూరో:  మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మమత రెడ్డి దంపతులు స్థానిక పటేల్‌నగర్, దుర్గానగర్, బీజేఆర్ నగర్‌లోని అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

హైదరాబాద్‌ను సేఫ్టీ నగరంగా మార్చుతాం : భట్టి

లాల్‌దర్వాజ, భాగ్యలక్ష్మి ఆలయాలను దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను సేఫ్టీ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. బోనాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందన్నారు.  

మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం : కోమటిరెడ్డి

అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కుట్ర ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా, దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ఎద్దేవా చేశారు.

గోల్డెన్ టెంపుల్‌గా భాగ్యలక్ష్మి ఆలయం : బండి సంజయ్

చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మిఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నారా.. రంజాన్‌కు కోట్ల నిధులిస్తూ బోనాలకు నిధులెందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. పాతబస్తీలోని 24 దేవాలయాలకు రూ.24 లక్షల నిధులిచ్చి తబ్లిగీ జమాతేకు రూ.2.4 కోట్లు ఇస్తారా అని అన్నారు. మజ్లిస్ గోడ మీద పిల్లి లాంటి పార్టీ అన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇవ్వడం ఆ రెండు పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట అని విమర్శించారు. దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేయాలని సవాలు విసిరారు. అక్కడ పోటీ చేస్తే అక్బరుద్దీన్‌కు డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని చెప్పారు. అక్బరుద్దీన్ గత సీఎం కేసీఆర్‌ను అంకుల్ అనేవారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని అన్న అని సంబోధిస్తున్నారని ఎద్దేవా చేశారు.