మాతృత్వం
వాళ్ళెప్పుడూ అంతే
లేదు పొమ్మంటారు
అయినా ఆమె
గుమ్మం ముందు శిలలా నిల్చుంటుంది
ఎండలు మండుతున్నా ...
వానలు కురుస్తున్నా ...
చలిగాలులు వణికిస్తున్నా...
ఇళ్ళ ముందు నిలబడి
అలా అర్థించడమే
ఆమె దినచర్య
చేతిలో మట్టిపాత్ర
నిండుకునేంత వరకు
ఆమె స్వరం
ఆకలి అన్న పదాన్ని
స్మరిస్తూనే ఉంటుంది
చీకటి తనను చుట్టుకోక ముందే
వీధి చివరి పాత గుడిసెకు వెళ్ళిపోతుంది
అక్కడ ఆమెను చూడగానే
పిల్లలు పరిగెత్తుకొచ్చి
హత్తుకుంటారు
పేగుబంధం పెనవేసుకోగానే
ఆమె అలుపంతా ఆవిరైపోతుంది
మనసు కాస్త తేలిక పడుతుంది
ఊర్లో బువ్వలన్నీ
గోరుముద్దలు చేసి
బిడ్డల ఆకలి తీరుస్తుంది
పచ్చడి మెతుకులైనా...
పంచభక్ష పరమాన్నాలే కదా!
తినిపించే చేయి
అమ్మదైనప్పుడు
కడుపారా తినేసి
మనసారా నవ్వుతూ పిల్లలు
ఆటల్లో పాటల్లో
మునిగి పోతారు
అప్పుడు ఆమె కళ్ళనుండి
జలజలమంటూ
నీళ్ళొలుకుతాయి
అవి కన్నీళ్లో... ఆనంద భాష్పాలో...
ఎంతకీ బోధ పడదు?
ఒక్కొకప్పుడు అంతే!...
మాతృత్వంలోని మర్మం
అమ్మకే అర్థం కాదు.
-ఎ. నాగాంజనేయులు