08-04-2025 12:33:43 AM
విశాఖపట్నం, ఏప్రిల్ 7: మాతృ భాషకు పెద్దపీట వేయడం ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత అని, మాతృభాష లో మాట్లాడటం గర్వంగా భావించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. డా.గజల్ శ్రీనివాస్, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో అమరా వతి రాజధాని గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ గ్రౌం డ్స్‌లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నా రు.
అందుకు సంబంధించిన లోగోను గోల్ఫ్ క్లబ్, విశాఖపట్నంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. విద్యా బోధనలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాతృభాషను మరింత ముందుకు తీసుకెళ్లేందకు చర్యలు తీసుకోవడం అభినందనీయం అని అన్నారు.
డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఏపీలో అతి పెద్ద తెలుగు పండుగగా తెలుగు మహా సభలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర ప్రముఖు లు, దేశాధినేతలు, న్యాయమూర్తులు, చలన చిత్ర, సాహితీ, సాంస్కృతిక ప్రముఖు లు ఈ పండుగలో పాల్గొంటారని తెలిపారు.
కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి ధవేజీ, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, తెలుగు మహాసభల ముఖ్య సమన్వయ కర్త పి.రామచంద్ర రాజు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వై.డి.రామారావు, కళా భారతి అధ్యక్షుడు ఎమ్.ఎస్.ఎన్. రాజు, కోడూరి సుశీల పాల్గొన్నారు.