- కొత్త వెబ్ పోర్టల్‌లో అధికారాల వికేంద్రీకరణ
- తహసీల్దార్లతో పాటు ఆర్డీవోలకు, అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు
ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు
నేడో, రేపో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా?
- జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబునల్స్, ఆ తర్వాతే సివిల్ కోర్టుకు
- రద్దయిన వీఆర్వోల స్థానంలో విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పోస్టు
- ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 30 (విజయక్రాంతి): ధరణి రద్దుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలతో సతమతం అవుతున్న రైతులకు త్వరలోనే మోక్షం లభించనుంది. ధరణి వెబ్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక సమస్యలకు శాశ్వతంగా పుల్‌స్టాప్ పెట్టేందుకు జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్త యింది. ధరణి స్థానంలో ‘భూమాత’ పేరుతో నూతన రెవెన్యూ వెబ్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది.
ధరణి పేరును భూమాతగా మార్చడంతోపాటు ధరణి వెబ్ పోర్టల్‌లో ఉన్న లోపాలను పూర్తిగా సవరించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ రెవెన్యూ వెబ్ పోర్టల్‌గా భూమాతను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తు త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, ధరణికి ప్రత్యామ్నాయంగా భూ మాత వెబ్‌పోర్టల్‌తో పాటు కొత్త రెవె న్యూ చట్టం తీసుకువస్తామని పదేపదే చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణి రద్దుతో పాటు కొత్తగా తీసుకురాబోతున్న ఆర్‌ఓఆర్ (రికార్డు ఆఫ్ రైట్) యాక్టు ముసాయిదాపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
అధికారాలు వికేంద్రీకరించేలా చర్యలు..
ప్రస్తుతం ధరణిలో ప్రతి చిన్న సమస్య పరిష్కారం కోసం కూడా బాధితుల దరఖాస్తులు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లి రావాల్సిందే. కలెక్టర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ దరఖాస్తుల పరిష్కారం రెండు అడుగులు ముందు కు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ధరణిలో వివిధ భూ సమస్యలతో సుమారు 2.50 లక్షల పైచిలుకు దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతున్న భూమాత వెబ్ పోర్టల్‌లో రెవెన్యూ అధికారుల అధికారాలను వికేంద్రీకరించి రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా తహసీల్దార్‌తో పాటు ఆర్డీవోలకు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)కు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కరించే అధికారాలను అప్పగించనున్నారు.
మళ్లీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ..
కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి న ఆర్‌ఓఆర్ యాక్టు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో 1971 ఆర్‌ఓఆర్ యాక్టు ప్రకారం నిర్వహిస్తున్న తహసీ ల్దార్ కోర్టు, ఆర్డీవో కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రద్దు అయ్యాయి. గతంలో రద్దు చేసిన రెవెన్యూ కోర్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. అయితే తహసీ ల్దార్ కోర్టులను మాత్రం పునరుద్ధరించడం లేదని, కేవలం ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ కోర్టులను మాత్రమే పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
అలాగే, జిల్లా కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో జరిగే నిర్ణయాలపై అభ్యంతరాలున్నవారు మాత్రమే సివిల్ కోర్టుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్‌ఓఆర్ యాక్టు ప్రకారం ప్రతి చిన్న భూ సమస్యకు కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. అధికారులు చేసి న తప్పులకు కూడా రైతులే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గడిచిన మూడున్నరేండ్లలోనే లక్షల మంది రైతులు సివిల్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నేడో రేపో అసెంబ్లీకి ముసాయిదా?
తెలంగాణలో భూ సమస్యలకు కొత్త రెవెన్యూ చట్టం ఒక్కటే పరిష్కారమని సీఎం రేవంత్‌రెడ్డి మొదటినుంచి భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఆర్‌ఓఆర్ యాక్టుకు సంబంధించిన ముసాయిదాను ప్రముఖ భూ చట్టాల నిపుణులతో సిద్ధం చేయించారు. ఈ ముసాయిదాపై దాదాపుగా కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం. ఈ ముసాయిదాను నేడో రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అసెంబ్లీలో చర్చించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సూచనలు.. సలహాలను స్వీకరించిన తర్వాత ప్రజల అభీష్టం మేరకు నూతన రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు.
కేసీఆర్ తెచ్చిన యాక్టుకు చరమగీతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్‌ఓఆర్-1971 చట్టం అమల్లో ఉండేది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 9వ తేదీన ‘రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్టు-2020’ పేరు తో కొత్త ఆర్‌ఓఆర్-2020 యాక్టును అమల్లోకి తెస్తూ గెజిట్ (ఎల్.ఏ.బిల్ నెంబర్ 7 ఆఫ్ 2020) విడుదల చేయ డం జరిగింది. అంతకు ముందు ‘ధరణి’ పేరుతో 2018లోనే పట్టాదారు పాసు పుస్తకాలను జారీచేసిన కేసీఆర్ ప్రభు త్వం మాన్యువల్ రికార్డుల స్థానంలో డిజిటల్ రెవెన్యూ రికార్డులను రైతులకు అందించాలనే లక్ష్యంతో 2020 నవంబర్ 29వ తేదీన మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో నాటి సీఎం కేసీఆర్ ‘ధర ణి’ డిజిటల్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. అయితే ఈ యాక్టును అత్యంత లోపభూయిష్టంగా, రెవెన్యూ, భూ చట్టాల నిపుణుల అభిప్రాయాలను పరగణలోకి తీసుకోకుండా తీసుకురావడం వలన రాష్ట్రంలో భూ సమస్యలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే కేసీఆర్ అమ ల్లోకి తీసుకువచ్చిన ఆర్‌ఓఆర్ యాక్టుకు చరమగీతం పాడేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్తగా విలేజ్ రెవెన్యూసెక్రటరీ పోస్టులు
నాటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసింది. అనంతరం వీఆర్‌ఓ పోస్టులను కూడా రద్దు చేస్తూ వీఆర్వోలను, వీఆర్‌ఏలను వేరు వేరు శాఖలలో పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ భూముల పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. ఈ క్రమంలోనే రద్దయిన వీఆర్వోల స్థానంలో కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీలుగా ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా నిర్ణయించింది. గతంలో డిగ్రీ, ఆపై చదువులు పూర్తిచేసి వీఆర్‌ఓలుగా టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకం అయిన ఉద్యోగుల అర్హతల మేరకు వీలేజ్ రెవెన్యూ సెక్రటరీలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
విలేజ్ రెవన్యూ సెక్రటరీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కానీ డిగ్రీ పూర్తయి టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకం అయిన వారు కేవలం 3,533 మంది మత్ర మే ఉన్నారు. వీరి లో డిగ్రీ, అపై చదువులు చదివిన వారు 60శాతం మంది మాత్రమే ఉన్నట్లు ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ క్రమంలోనే డిగ్రీ పూర్తి చేసి టీఎస్‌పీఎస్సీ ద్వారా వీఆర్‌ఏలుగా నియామకం అయిన వారిని కూడా అర్హతలను బట్టి విలేజ్ గ్రామ రెవెన్యూ సెక్రటరీలుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
- బూడిద సుధాకర్ :