calender_icon.png 24 October, 2024 | 2:11 AM

గురుకులాలకు మదర్ డెయిరీ పాలు

15-09-2024 02:17:27 AM

  1. యాదగిరిగుట్ట ఆలయానికి నెయ్యి సరఫరా 
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  3. మంత్రి సమక్షంలో మదర్ డెయిరీ చైర్మన్‌గా మధుసూదన్‌రెడ్డి ఎన్నిక

ఎల్బీనగర్/యాదాద్రిభువనగిరి, సెప్టెంబర్ 14: నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించడంతో పాలన పగ్గాలు చేతికి చిక్కాయి. నల్గొండలోని నాలుగు డైరెక్టర్ స్థానాలు, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో మదర్ డెయిరీ చైర్మన్ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ మేరకు శనివారం మదర్ డెయిరీలో చైర్మన్ ఎంపికపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. గుడిపాటి మధుసూదన్‌రెడ్డిని డైరెక్టర్లు ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్లకు ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఎన్నికైన డైరెక్టర్లకు ఎన్నికల అధికారి వెంకట్‌రెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.  

మదర్ డెయిరీకి పూర్వ వైభవం.. 

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మదర్ డెయిరీ రూ.60 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు.  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మదర్ డెయిరీ పాలు నాణ్యతకు పేరు అని, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు మదర్ డెయిరీ పాలు సరఫరా చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని గురుకులాలు, పాఠశాలలకు పాలను సరఫరా చేయాలని కలెక్టర్లకు ఫోన్ చేసి కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూల తయారీకి మదర్ డెయిరీ నెయ్యిని వినియోగించాలని మంత్రి కొండా సురేఖను కోరా రు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు చెంది న శ్రీజ డెయిరీ బినామీ కంపెనీల పేర్లతో యా దగిరిగుట్ట, వేములవాడ ఆలయాలకు నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు మదర్ డెయిరీ మాజీ చైర్మన్లు జితేందర్‌రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, నూతన చైర్మన్ గుడిపాటి మధుసూ దన్‌రెడ్డి, కల్లెపల్లి శ్రీశైలం, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్‌రెడ్డి, మండలి జం గయ్య, అగ్రాల నర్సింహరెడ్డి పాల్గొన్నారు.