calender_icon.png 22 October, 2024 | 2:37 AM

ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన కసాయి తల్లి

21-10-2024 08:38:44 PM

అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ

అంగన్ వాడి టీచర్ అప్రమత్తతతో సఖి కేంద్రానికి తరలింపు

దౌల్తాబాద్,(విజయక్రాంతి): 20 రోజుల ఆడ శిశువును ఓ కసాయి తల్లి విక్రయానికి పెట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామ శివారులో సోమవారం జరిగింది. స్థానికులు, ఐసిడిఎస్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ మండల పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మహిళకు నాలుగు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత మహిళ గర్భం దాల్చింది. 20 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవ జరగగా సదరు మహిళ ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టారు. దాంతో ఆ మహిళ గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో నివాసం ఉంటుంది. సోమవారం పాపను అమ్మకానికి పెట్టింది. కొనుగోలు చేసేవారు పాపను ఇందుప్రియాల్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతానికి తీసుకురావాలని సూచించగా పాపతో మహిళ అక్కడికి వెళ్ళింది. కొనుగోలుదారులు ఇస్తానని చెప్పినంత డబ్బులు ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. గట్టిగా మాటలు వినిపించడంతో సమీపంలో ఉన్న మేకల కాపర్లు వారి వద్దకు వెళ్లి ఇందుప్రియల్ అంగన్వాడీ టీచర్ కు సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన టీచర్ ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకుంది. తల్లి బిడ్డను అంగన్వాడి సెంటర్ కు తీసుకురాగా బాల పరిరక్షణ అధికారులు, అంగన్వాడి కేంద్రానికి వచ్చి తల్లి బిడ్డలను సఖి కేంద్రానికి తరలించారు. కొనుగోలు దారుల పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు గృహ సామాజిక కార్యకర్త రాజారాం, హెల్ప్ లైన్ అధికారి కవిత, నర్స్ శ్యామల, ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ, అంగన్వాడీ టీచర్లు సుల్తానా, మంజుల, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.