calender_icon.png 21 September, 2024 | 8:24 AM

వరకట్న వేధింపులకు తల్లీ, కూతురు బలి

21-09-2024 12:22:26 AM

ఈ నెల 18న గడ్డిమందు తాగిన గర్భిణి

చికిత్స పొందుతూ శిశువుకు జన్మనిచ్చిన తల్లి

19న శిశువు, 20న తల్లి మృతి

హనుమకొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వరకట్న వేధింపులకు తల్లీ, కూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయ్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. దేశాయ్‌పల్లికి గ్రామానికి చెందిన ప్రవళిక(22), వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముదురుకోళ్ల సందీప్ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లున ఏడాది నుంచే భర్త సందీప్, అత్త విజయ రూ.10 లక్షల కట్నం, రెండెకరాల పొలం ఇవ్వాలని ప్రవళికను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారు.

పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో రెండోసారి గర్భందాల్చి, ఎనిమిది నెలలు నిండిన తర్వాత అదనపు కట్నం తేవాలని ప్రవళికను నెలరోజుల క్రితం పుట్టింటికి పంపించారు. అప్పటి నుంచి ప్రవళిక పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవళిక ఈ నెల 18న గడ్డి మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ప్రవళికకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువు జన్మించింది. శిశువు ప్రాణాలతో ఉండటంతో ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి 19న మరణించింది. ప్రవళిక చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. ఒక్కరోజు తేడాతో తల్లీ, కూతురు మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సందీప్‌తో పాటు అత్త విజయనే కారణమంటూ మృతురాలి బంధువులు దుగ్గొండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.