22-04-2025 08:11:14 PM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): సమతుల పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీ తో పాటు పుట్టబోయే శిశువు క్షేమంగా ఉంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. పోషకాహారం అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పోషణ పక్షం 8 ఏప్రిల్ నుండి 22 ఏప్రిల్ వరకు అవగాహన సదస్సులు, ఆరోగ్య సదస్సులు, పోషకాహార ప్రదర్శనలు, వైద్య శిబిరాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఏప్రిల్ 22 చివరి రోజున భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాల కాంప్లెక్స్ లో జరిగిన పోషణ పక్షం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరై, పోషణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు.
గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. “భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పోషణ పథకాలు కీలకం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన పోషకాహారం అందించేందుకు అందరూ బాధ్యత వహించాలి. ప్రతి తల్లి తన శిశువును ఆరోగ్యవంతంగా పెంచేందుకు పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలి” అన్నారు. అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ... “పోషణ పక్షం సందర్భంగా గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు, తగిన చర్యలు తీసుకున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార అవగాహన పెరుగుతుంది. పోషణ అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల పాత్ర అమూల్యం” అని తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ.. “పిల్లల్లో పోషకాహార లోపాలను నిర్ధారించేందుకు బరువు, ఎత్తు కొలతలు, హేమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాం. గర్భిణులకు, బాలింతలకు ప్రత్యేకంగా పోషకాహార కిట్లు, అవగాహన పుస్తకాలు అందించాం” అని ప్రత్యేకంగా 1000 రోజుల ప్రణాళికలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అని వివరించారు. మహదేవ పూర్ ఐసీడీఎస్, సీడీపీఓ రాధిక మాట్లాడుతూ.. “ఆంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 15 రోజులపాటు పోషణ కార్యకలాపాలు, తల్లులకు పోషకాహార శిక్షణ, పోషణ పై నాటకాలు, పోటీలు నిర్వహిస్తాం. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబాన్ని చేరి పోషకాహారాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక టీమ్స్ పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
తదుపరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీమంతాలు, అక్షరాబ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పోషకాహార ప్రదర్శనలలో భాగంగా వివిధ ధాన్యాలు, పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలు, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే పోషకాహార వంటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, సంక్షేమ శాఖ సిబ్బంది, ఆంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.