calender_icon.png 24 November, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరలో మోతె చెరువు

27-08-2024 02:47:52 AM

  1. జేసీబీలతో ఎఫ్‌టీఎల్‌లో మట్టిపోయిస్తున్న కబ్జాదారులు
  2. అడ్డుకున్న మత్స్యకారులు 
  3. ఫిర్యాదు చేసినా సెలవు సాకుతో స్పందించని యంత్రాంగం
  4. ‘హైడ్రా’ తరహా వ్యవస్థ తీసుకురావాలని జగిత్యాలలోని స్థానికుల డిమాండ్

జగిత్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని మోతె చెరువు కబ్జా కోరల్లో చిక్కుకున్నది. గతంలో 90 ఎకరాల పరిధిలో ఉన్న చెరువు 45 ఎకరాలకు కుంచించుకుపోయింది. చెరువు ఈ ప్రాంతానికే కాక పొరుగు జిల్లా సిరిసిల్లలోని చెరువులు నిండేందుకూ ప్రధాన వనరు. ఒక్క మోతె చెరువు నిండితే ఏటా వానకాలంలో గొలుసుకట్టు విధానం ద్వారా ఇతర చెరువులు నిండుతాయి. అంతటి ప్రాధాన్యమున్న చెరువు ఎఫ్‌టీఎల్ స్థలంలో సగానికిపైగా కట్టడాలు వెలిశాయి. 

జగిత్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): మోతె చెరువును దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్ భూమిలో కొందరు కబ్జాదారులు బాజాప్తాగా జేసీబీ లతో మట్టి పోయిస్తున్నారు. స్థానిక మత్స్యకారులకు ఈ విషయం తెలిసింది.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘటనా స్థలానికి వచ్చారు. మట్టి పోయించే పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. చెరువే తమకు జీవనాధారమని, చెరువు లేకపోతే తమకు జీవనమే లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఎఫ్‌టీఎల్ భూమి కబ్జా అయిందని, మిగిలిన భూమిన కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి, కబ్జాదారుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మత్స్యకారులు చెరువు కబ్జాకు గురవుతున్నదని ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కృష్ణాష్టమి సెలవులో ఉన్నామని చెప్తున్నారని వాపోయారు. అనంతరం కబ్జాదారుల అనుచరులు మత్స్యకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. 

హైడ్రా విస్తరణకు చొరవ చూపాలి.. 

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చెరువులు, నాలాల ఆక్రమణకు గురికాకుండా పరిరక్షణకు హైడ్రా ఏర్పడినట్లు రాష్ట్రప్రభుత్వం జిల్లాల్లోనూ అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్ఫలితాలు సాధిస్తున్నారు. సీఎం హైడ్రా వంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలి. హైడ్రా విస్తరణ సాధ్యం కాకపోతే కనీసం కలెక్టర్లకు చెరువులు, నాలాలను కాపాడే అధికారం ఇవ్వాలి. ఆక్రమణలకు పాల్పడే వారెంతటి వారైనా వదలిపెట్టొద్దు.

 ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి

జేసీబీలతో మట్టిపోస్తున్నా పట్టించుకోరా?

మోతె చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమార్కులు జేసీబీలతో మట్టి పోసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నా అధికారులు పట్టించుకోరా? హైదరాబాద్ చుట్టపక్కన ప్రాంతాల్లో హైడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు, కూల్చి వేస్తున్న విధంగానే జగిత్యాల జిల్లాలోనూ అమలు చేయాలి. చెరువుల ఆక్రమణలకు పాల్పడే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి. ఆక్రమణలతో మోతె చెరువు విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ఆక్రమణలను అడ్డుకోకపోతే మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తాం.

 మాజీ ఎంపీటీసీ రొక్కం రాజశేఖర్‌రెడ్డి