- భారత బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్
- 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పదవిలో..
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ హవా
న్యూఢిల్లీ: భారత జట్టు నూతన బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా బుధవారం మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి మోర్కెల్ కాంట్రాక్ట్ మొదలుకానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌తో మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు మోర్కె ల్ పదవిలో కొనసాగనున్నాడు.
కాగా ద్రవిడ్ హయాంలో బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన పరాస్ మెంబ్రేను బీసీసీఐ ఇటీవలే తొలగించింది. కాగా శ్రీలంకతో సిరీస్‌కు సాయిరాజ్ బహుతులే తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో గతంలో మోర్కెల్ పాకిస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా తరఫున స్టార్ బౌలర్ గా పేరు పొందిన మోర్కెల్ 86 టెస్టుల్లో 309 వికెట్లు, 117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు.
గంభీర్ మార్క్..
మోర్నీ మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా రావడం వెనుక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలకపాత్ర పోషించాడు. ద్రవిడ్ అనంతరం హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ఆది నుంచి తన కంటూ ప్రత్యేక టీంను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన వెంట ఉన్న అభిషేక్ నాయర్‌ను తన అసిస్టెంట్ కోచ్‌గా రప్పించుకున్నాడు. గతంలో అదే జట్టుకు ఆడిన టెన్ డస్కటేను మరో అసిస్టెంట్‌గా ఎంచుకున్నాడు.
తాజాగా మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక గంభీర్ మార్క్‌ను స్పష్టంగా చూపిస్తోంది. గంభీర్‌తో మోర్కెల్‌కు మంచి అనుబంధముంది. వీరిద్దరు కలిసి 2014లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ గెలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు అదే జట్టుకు మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. రానున్న నాలుగేళ్లలో భారత్ మూడు మెగా టోర్నీలు ఆడనున్న నేపథ్యంలో షమీ, బుమ్రా, సిరాజ్ లాంటి పేసర్లను మెరుగైన ప్రదర్శన రాబట్టడంలో మోర్కెల్ సఫలీకృతమవుతాడా చూడాలి.
రోహిత్ అదుర్స్..
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో హిట్‌మ్యాన్ (765 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. ఆతిథ్య జట్టుకు 2 సిరీస్ కోల్పోయినప్పటికీ రోహిత్ మూడు వన్డేలు కలిపి 157 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉండడం విశేషం. టాప్‌ౠ శుబ్‌మన్ గిల్ ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 824 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ శ్రేయాస్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ ముగ్గురు భారత బౌలర్లు చోటు దక్కించుకోగా.. వారిలో కుల్దీప్ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. బుమ్రా 8వ స్థానంలో ఉండగా.. సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు. కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ విభాగంలో 118 పాయింట్లతో టీమిండియా తొలి స్థానం నిలుపుకోగా.. ఆస్ట్రేలియా (116), సౌతాఫ్రికా (112) రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. లంకతో సిరీస్ అనంతరం స్వదేశానికి చేరుకున్న టీమిండియా సెప్టెంబర్ 19న బంగ్లాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది.