calender_icon.png 29 November, 2024 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిన్ని గిడ్డంగులు అందుబాటులోకి తెస్తాం

09-10-2024 02:26:59 AM

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా మరిన్ని గిడ్డంగులను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గిడ్డంగులను ఆధునికరించడంతోపాటు కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు.

మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. మార్క్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాములతో ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సెన్సార్ల ద్వారా గోదాముల్లో ఉష్ణోగ్రత, తేమలను పర్యవేక్షించే ఏర్పాట్లు చేయాలన్నారు.

గోదాములకు వచ్చే వాహనాల వివరాలు క్యాప్చర్ చేసేవిధంగా చూడాలని, ఏఐ టెక్నాలజీ వాడాలని సూచించారు. ఆయిల్‌పాం ఫ్యాక్టరీల స్థాపనకు, నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి కేటాయింపు కోసం చర్యలు చేపట్టాలన్నారు. సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ వచ్చే ఆగస్టు వరకు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఎండీ ఉదయ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్ బాషా, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

నేతన్నలకు ప్రయోజనకరంగా ప్రభుత్వ చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమం కోసం, వారికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటుందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ చేనేతలక్ష్మీ వంటి కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేసి, టెస్కో ద్వారా అమ్మకాలు పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం సచివాలయంలో చేనేత అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. 2024 పది డిపార్టుమెంట్ల నుంచి రూ.234.80 కోట్ల విలువైన యూనిఫాం, బెడ్డింగ్ మెటీరియల్ కోసం టెస్కోకు ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.

ఈ ద్వారా రూ.2.3 కోట్ల అమ్మకాలు నిర్వహించామని వివరించారు. ఆర్ అండ్ డీ ద్వారా కొత్త డిజైన్లతో చీరల ఉత్పత్తి చేసి కస్టమర్లను ఆకర్షించేందుక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్కో నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం మంజూరు చేసిన యార్న్ డిపో ద్వారా పవర్ లూమ్ వర్కర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మంత్రికి వివరించారు..