calender_icon.png 22 September, 2024 | 4:30 AM

కరీంనగర్ కార్పొరేషన్‌లోకి మరో 6 గ్రామాలు

22-09-2024 01:51:08 AM

కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనానికి రంగం సిద్ధం

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదన

త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం?

కరీంనగర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఆరు గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి పంపించారు. మరో  నాలుగు నెలల్లో మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండగా, వచ్చే ఎన్నికల నాటికి ఆయా గ్రామాల విలీన ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో మంత్రి ఉన్నట్లు తెలిసింది.

కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రామాలు, కొత్తపల్లి మండల పరిధిలోని చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతోపాటు కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీనీ సైతం కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్, పద్మనగర్, అల్గునూరు, సదాశివపల్లి, రేకుర్తి, వల్లంపహడ్ గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతోనే మంత్రి విలీన ప్రతిపాదన తీసుకొచ్చారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సైతం విలీనానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గ్రామాల విలీనం ద్వారా కాంగ్రెస్ పట్టు  మరింత పెంచుకుని, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మంత్రి పావులు కదుపుతున్నారు.