calender_icon.png 27 October, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్‌కార్డులకు మరింత సమయం

27-10-2024 12:00:00 AM

  1. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియకు మరో నాలుగు నెలలు
  2. ఆ ప్రక్రియ తర్వాతే తెరపైకి రేషన్‌కార్డుల అంశం 
  3. కార్డులకు, కొత్తగా పేర్లు చేర్చేందుకు 11.50 లక్షల దరఖాస్తులు
  4. సమస్యను సత్వరం పరిష్కరించాలని లబ్ధిదారుల వేడుకోలు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఇప్పట్లో ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఈనెల 2 నుంచి అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ నుంచి ప్రకటన విడుదల కావడంతో ఎంతోమంది నిరుపేదల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని.. కార్డులో కొత్తగా కుటుంబ సభ్యులు నమోదు ఉంటుందని అధికారులు తేల్చి చెప్పడంతో వారు నిరాశకు గురయ్యారు.

ఫ్యామిలీ కార్డులపై ఇప్పటికే ఉన్నతాధికారులు రెండుసార్లు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఆ అంశం కొలిక్కి రాలేదని సమాచారం. దీంతో మరో నాలుగైదు నెలల పాటు నిరీక్షణ తప్పదని తెలిసింది.

రేషన్‌కార్డుదారులు కొన్నేళ్ల నుంచి కార్డులో కొత్తగా పిల్లల పేర్లు చేర్చాలని, పెళ్లిళ్లు చేసుకున్న వారు తమ భాగస్వాముల పేర్లను కార్డులో చేర్చాలని వేచి చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కార్డుల్లో కొత్తవారి పేర్లు లేకపోవడంతో వారు అనేక సంక్షేమ పథకాలకు దూరమవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది.

11.50 లక్షల దరఖాస్తులు..

గత ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కుటుం బ సభ్యుల పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నాడు ఆన్‌లైన్ ద్వారా 11.50 లక్ష ల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వాటిపై ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎన్నికల సమయంలో నాటి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే అవకాశం కల్పించాలని కోరారు. అందుకు ప్రజాప్రతినిధులు తమ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఆ ప్రక్రియ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని చవి చూసింది.

తర్వాత కొత్తగా పాలన పగ్గాలు చేపట్టిన సర్కార్ ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ప్రజలు ఇప్పటికైనా రేషన్‌కార్డుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశ పడ్డారు. కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటుతున్నా సమస్యకు పరిష్కారం లభించకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు.

ఆమోదిస్తే రూ.37 కోట్ల భారం..

కొత్తగా అందిన దరఖాస్తులను ఆమోదిస్తే ఇకపై ప్రభుత్వం నెలకు అదనంగా మరో 9,890 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. నిధుల పరంగా నెలకు రూ.37.40 కోట్ల భారం పడనున్నట్లు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ప్రభుత్వం ముందుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సరైన నిర్ణయం తీసుకున్నాకే, కొత్త రేషన్ కార్డుల అంశంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ప్రతి ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారమంతా ఉండేలా సర్కార్ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయిస్తున్నట్లుస సమాచారం.

లబ్ధిదారుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో రేషన్ దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబానికి ఎన్ని సరుకులు ఇవ్వాలో ఇట్టే డీలర్‌కు తెలిసిపోతుంది. ఈ విధానం ద్వారా రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా, డీలర్ల అక్రమాలకు ముక్కుతాడు వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.