హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బాలల దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మహనీయుడికి నివాళులు అర్పించి, విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.5 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవలే హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని, విద్యార్థుల కలలను నిజం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తొలిసారి బాలల దినోత్సవం జరుపుకోవడం, చిన్నపిల్లలతో ఇలా సమయం గడపడం తనకు ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు, దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత అని గుర్తు చేశారు. నవీన భారత రూపశిల్పి జవహర్ లాల్ నెహ్రూ అని, భారత్ ను లౌకిక దేశంగా నిలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాలల దినోత్సవంతో ఉత్సవాలు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పేదలకు విద్యను నెహ్రూ అందుబాటులోకి తెచ్చారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని సీఎం వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో 7 శాతానికిపైగా నిధులు విద్యాశాఖకు కేటాయించామని, ఉపాధ్యాయుల సమస్యను పరిష్కారించాలని పదోన్నతులు ఇచ్చాం, బదిలీలు చేశామని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసి, విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.