బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రజల ఆశీస్సు లు తిరిగి పూర్తిస్థాయిలో పొందాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అని చెప్పారు. మనందరం మనస్ఫూర్తి గా కాంక్షిస్తున్నది ఒక్కటేనని, కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి సీఎం కావాలనే ఒకే ఒక్క కోరికతో గట్టిగా పని చేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి భగవంతుడు అందరికీ ప్రసాదించాలని పేర్కొన్నారు. అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కులమతాల కు అతీతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం, రాష్ర్టం ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.