మార్గదర్శకాలు రూపొందించాలె
కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న దరఖాస్తులు, పలు సర్టిఫికెట్ల జారీ వంటి సేవలతోపాటు అదనంగా 9 సేవలు లభించనున్నాయి. ఈ మేరకు సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ మాధవి దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మీసేవల ద్వారా అందించే సేవల ప్రతిపాదనలపై ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరి కమిషనర్‌కు పలు సూచనలు చేశారు.
దీంతోపాటు అదనంగా సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై వీలైనంత త్వరగా మార్గదర్శకాలను రూపొం దించి పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా అందించే 9 రకాల సర్టిఫికెట్లు ఇక నుంచి మీసేవల ద్వారా పొందేందుకు అవకాశం లభించనుంది. మీసేవల ద్వారా అదనంగా లభించే సేవల్లో గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు సర్టిఫికెట్, స్థానికత సర్టిఫికెట్, మైనార్టీ సర్టిఫికెట్, రీఇష్యూ సర్టిఫికెట్(ఇన్‌కం, క్యాస్ట్), క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, పాత రికార్డులు (పాత కాస్రా/ పహాణీ), ఆర్‌వోఆర్ సర్టిఫైడ్ కాపీ వంటివి ఉన్నాయి.