calender_icon.png 30 September, 2024 | 12:02 PM

డయాలసిస్ పేషెంట్లకు అందుబాటులో మరిన్ని సేవలు

29-09-2024 02:12:49 AM

కొత్తగా 7 వాస్క్యులర్, 18 డయాలసిస్ సెంటర్లు

ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా 74 డయాలసిస్ యంత్రాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కిడ్నీ పేషెంట్లకు ఊరట కల్పించే లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లు, 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 74 డయాల సిస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాలి. వారి పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసి స్ అవసరమవుతుంది.

తొలిసారి డయాలసిస్ చేసే సమయంలో   రోగికి మొద ట ఓ శస్త్రచికిత్స చేస్తారు. డయాలసిస్‌కు యాక్సెస్ పాయింట్‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేస్తారు. రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యాస్కులర్ సర్జన్ ఈ సర్జరీ చేస్తారు.  

ఇక హైదరాబాద్ రాకుండానే..

ప్రస్తుతం ఈ వాస్క్యులర్ సర్జరీ చేయించుకునేందుకు కిడ్నీ పేషెంట్లు కచ్చితం గా హైదరాబాద్ రావాల్సి వస్తోంది. దీని వల్ల వారికి ఆర్థికంగా భారం అవడం తోపాటు, నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తం గా వాస్క్యులర్ యాక్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఖమ్మం జనరల్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం, మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతు న్నారు. అలాగే, నిమ్స్, గాంధీ, ఉస్మానిలలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తం ఏడు సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను ప్రభు త్వం కేటాయించింది.

కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాలు..

డయాలసిస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 కేంద్రాలున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. దీంతో కొన్ని సెంటర్లలో అర్ధరాత్రి వరకు డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీని వల్ల ప్రస్తుతం ఉన్న సెంటర్లపై భారం తగ్గడంతో పాటు, కొత్తగా ఏర్పాటయ్యే సెంటర్లతో పేషెంట్లు ప్రయాణించాల్సిన దూరం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.