calender_icon.png 17 November, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత తగ్గిన బంగారం

13-11-2024 12:00:00 AM

  1. హైదరాబాద్‌లో మరో  రూ.1,470 తగ్గిన తులం ధర
  2. రెండు రోజుల్లో రెండు వేలు తగ్గుదల

హైదరాబాద్, నవంబర్ 12: పండుగలు ఇలా వెళ్లగానే అలా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ విజయంతో మొదలైన  బంగారం ధర క్షీణత కొనసాగుతున్నది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర మరో రూ. 1,470 తగ్గి రూ. రూ.77,290 వద్దకు చేరింది. సోమవారం ఇది రూ.600 క్షీణించగా, వరుస రెండు రోజుల్లో రూ. 2,000కుపైగా తక్కువయ్యింది. 

తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,350 తగ్గి, 70,850 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భారీగా తగ్గడమే దేశీయంగా దిగిరావడానికి కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. ప్రపంచ మార్కెట్లో సోమవారం రాత్రి ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర 60 డాలర్లకుపైగా పడిపోయి 2,600 డాలర్ల స్థాయికి పతనంకాగా, బుధవారం ఆ స్థాయిని సైతం వదులుకున్నది.  ఇందుకు అనుగుణంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛతకలిగిన బంగారం ఫ్యూచర్ ధర  మంగళవారం కడపటి సమాచారం అందేసరికి రూ.75,000 దిగువన ట్రేడవుతున్నది.

ఇంకా తగ్గే అవకాశం

అక్టోబర్ 10 తర్వాత ఎంసీఎక్స్‌లో రూ. 75,000లోపునకు పసిడి క్షీణించడం ఇదే ప్రధమమని, ఇదే ట్రెండ్ కొనసాగితే బుధవారం స్పాట్ మార్కెట్లో ధరలు మరింత దిగివస్తాయని అంచనా వేస్తున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో 26,000 డాలర్ల దిగువన కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.72,000 వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు. డాలరు ఇండెక్స్ 4 నెలల గరిష్ఠస్థాయికి పెరిగినందున, బం గారం ధర క్షీణత కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.