- మూడు రోజుల్లో 1,700పైగా పెరిగిన ధర
- ప్రపంచ మార్కెట్లో రికార్డుస్థాయికి పుత్తడి
హైదరాబాద్, ఆగస్టు 2: బడ్జెట్లో పన్నుల తగ్గింపు తర్వాత దిగివచ్చిన బంగారం ధర తిరిగి అంతర్జాతీయ ట్రెండ్ కారణంగా పుంజుకుంటున్నది. హైదరాబాద్ మార్కెట్లో వరుసగా మూడో రోజున ధర పెరిగింది. గురువారం 24 క్యారెట్ల బంగారం తులం ధర మరో రూ. 330 పెరిగి రూ.70,690 వద్దకు చేరింది. ఇది వరుస మూడు రోజుల్లో కలిపి రూ.1,740 మేర పెరిగింది. బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రూ.68,000 స్థాయికి దిగిన పుత్తడి తిరిగి రూ.70,500 స్థాయిని మించింది. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.64,800 వద్దకు చేరింది. ఇది మూడు రోజుల్లో రూ.1,600 మేర పుంజుకున్నది.
అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలో చిక్కు కుంటుందన్న భయాలు తలెత్తడంతో సురక్షిత సాధనంగా భావించే బంగారం పెట్టుబడులకు ఇన్వెస్టర్లు పరుగులు తీశారు. దీనితో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,522 డాలర్ల రికార్డుస్థాయికి పెరిగిపోయింది. అంతర్జాతీ య ధర 2,500 డాలర్ల స్థాయిని అధిగమించడం చరిత్రలో ఇదే ప్రధమం. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా ధర పెరుగుతున్నదని బులియన్ వర్తకులు తెలి పారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో (ఎంసీఎక్స్) పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,700 స్థాయికి చేరింది.