హైదరాబాద్‌లో రూ. 80,290కి తులం ధర
హైదరాబాద్, అక్టోబర్ 25: ధనతెరాస్, దీపావళి దగ్గరకొస్తున్న కొద్దీ వెండి బంగారాలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలు, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు, రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితి బంగారాన్ని పరుగులు తీయిస్తున్నాయి.
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 710 పెరిగి రూ.80,290 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర శుక్రవారం రాత్రి 5 డాలర్ల మేర పెరిగి 2,755 డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు స్థానిక మార్కెట్లో రానున్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరుకు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర మరో రూ.650 పెరిగి రూ.73,600 వద్దకు చేరుకున్నది. వెండి ధర మాత్రం వరుసగా రెండు రోజులు తగ్గి, శనివారం కేజీ ధర రూ. 1,07,000 వద్ద స్థిరంగా ఉన్నది. గురు, శుక్రవారాల్లో ఇది రూ.5,000 మేర తగ్గింది.