calender_icon.png 24 October, 2024 | 7:55 AM

‘బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయించాలి’

22-07-2024 02:57:01 AM

హైదరాబాద్, జూలై 21 ( విజయక్రాంతి): కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకు, బలోపేతానికి మోదీ ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ విభజన హామీల ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఐఐఐటీ, ఐఐఎం లాంటి అనేక విద్యాసంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని తెలిపారు.

తెలంగాణ రాష్ర్టంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నిధులు కేటాయించిందని ఆరోపించిన వారు  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ర్టంలో అంగన్వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యను అందించేలా రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, ఈ నిర్ణయంతో బీజేపీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ని రాష్ర్టంలో అమలు చేసినట్లవుతుందన్నారు.