calender_icon.png 12 January, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ ఇండియాలోకి మరిన్ని విమానాలు

10-12-2024 12:00:00 AM

ముంబై: ఎయిర్ ఇండియా కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది ఏ350, 90 నారోబాడీ ఏ320తో పాటు ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ ఏ321 నియో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు ఇచ్చిన ఆర్డర్‌కు భిన్నంగా ఉన్నది. తాజా ఆర్డర్‌తోఎయిర్‌బస్‌కు ఎయిర్ ఇండియా ఇచ్చిన విమానాల ఆర్డర్ సంఖ్య 350కి పెరిగింది. గతేడాది దేశీయ విమానయాన కంపెనీ ఎయిర్‌బస్‌కు250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది.

ప్రస్తుత నిర్వహణ అవసరాల కోసం ఎయిర్‌బస్ ఫ్లైట్ అవర్ సర్వీసెస్ కాంపోనెంట్‌ని ఎంచుకున్నట్లు ప్రకటించింది. టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రయాణికుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల కంటే వేగంగా పెరుగుతోందన్నారు. కొత్తగా ఆర్డర్ ఇచ్చిన వంద ఎయిర్‌బస్ విమానాలు.. ఎయిర్‌లైన్స్‌ను వృద్థి పథంలో తీసుకెళ్లడంతో పాటు.. భారతదేశాన్ని అనుసంధా నించే ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చే తమ మిషన్‌కు దోహదం చేస్తాయన్నారు.

ఎయిర్ బస్ సీఈవో గ్విలౌమె ఫౌరీ మాట్లాడుతూ ఇటీవల భారత విమానయాన రంగం విపరీత మైన వృద్ధిని వ్యక్తిగతంగా చూశానన్నారు. ఎయిర్‌బస్‌పై ఎయిర్ ఇండియా నమ్మకాన్ని చూసి సంతోషిస్తున్నాన్నారు. తాజా ఆర్డర్ తర్వాత ఎయిర్‌బస్ మొత్తం 344 కొత్త విమానాలను ఎయిర్ ఇండియాకు డెలివరీ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఆరు ఏ350 విమానాలు డెలివరీ చేసింది. ఎయిర్ ఇండియా 2023లో బోయింగ్ నుంచి 220 వైడ్‌బాడీ, నారోబాడీ విమానాలను ఆర్డర్ చేసింది. అందులో 185 విమానాలు ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది.