calender_icon.png 20 September, 2024 | 11:13 AM

వానొస్తే మోరంచపల్లికి వణుకే!

27-07-2024 12:05:00 AM

  1. గతేడాది పీడకలను మరువని గ్రామస్థులు 
  2. నాలుగు రోజులుగా భయం గుప్పిట్లో జనం 
  3. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి, జూలై 26 (విజయక్రాంతి): భయం వారిని ఇంకా వీడ లేదు.. ఎడతెరిపి లేకుండా వానలు కురిస్తే చాలు గతేడాది పీడకలలే వెంటాడుతుం టాయి.. వాగులు ఉప్పొంగుతున్నాయనేమాట వింటేనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో జోరు వానలు కురుస్తుండటం, వాగులు ఉప్పొంగుతుండటంతో గ్రామస్తులకు ఏడా ది కింది ఘటనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి సమయంలో ఇండ్లలో పడుకొనేందుకు జం కుతున్నారు. నిరుటి జూలైలో భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉప్పొంగి గ్రామాన్నే అతలాకుతలం చేసింది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయిన విషాధ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మోరంచవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గతేడాది పరిస్థితులే వస్తాయే మోనని తీవ్ర భయాందో ళనకు గురయ్యారు. ౪ రోజుల తర్వాత వర్షాలు తగ్గు ముఖం పట్టి వాగు ఉద్ధృతి తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.  

గతంలో రెండుసార్లు వరదలు 

నాలుగు దశాబ్దాల క్రితం ఒకసారి రెండు దశాబ్దాల క్రితం మరోసారి మోరంచపల్లికి వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1986లో మోరంచవాగు ఉప్పొంగి వరదలు వచ్చాయి. ఆ సమయం లో గ్రామంలో కేవలం 70 గుడిసెలు మాత్ర మే ఉండేవి. వరదలు వచ్చి గుడిసెలన్నీ నీటిలో మునిగిపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గ్రామాన్ని ఖాళీ చేయించా లని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తరపున కొత్త ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా గ్రామస్థులు ఒప్పుకోక అక్క డే ఉండిపోయారు. మళ్లీ 2000 సంవత్సరంలో చంద్రబాబు  సీఎంగా ఉన్న సమ యంలో మరోసారి వరదలు వచ్చాయి. ఆ సమయంలో గ్రామ ప్రజలు ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. వరదలు వచ్చి నా గ్రామస్థులు మాత్రం ఆ గ్రామాన్ని వదులలేదు. గతేడాది మోరంచవాగు ఉప్పొంగి ఊరినే ముంచేసింది. భారీ ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగింది.

నాలుగు రోజులుగా భయం గుప్పిట్లో 

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో మోరంచపల్లి వాసులు భయం గుప్పిట్లో కా లం వెళ్లదీశారు. గత ఏడాది జూలైలో భారీ వర్షాలతో మోరంచవాగు ఉప్పొంగి రాత్రికి రాత్రే ఊరిలోకి వరద నీరు చేరి ఊరినే ముంచేసింది. తెల్లారేసరికి ఊరంతా మునిగిపోవడం కళ్లారా చూసిన గ్రామస్థులు మళ్లీ అదే పరిస్థితి వస్తుందా? అనే ఆందోళనలో ఉండిపోయారు. భారీ వర్షాలు వరద ల కారణంగా మోరంచపల్లి వాగు ఉప్పొంగి ప్రవ హించిన క్రమంలో గ్రామస్థులు ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో కంటిమీద కునుకులేకుండా చేసింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద ఉద్ధృతి తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.  

మారని గ్రామస్తుల తలరాత 

ప్రభుత్వాలు మారినా పాలకులు మారి నా మోరంచపల్లి వాసుల తలరాత మాత్రం మారడంలేదు. ౪ దశాబ్దాలక్రితం ఎన్టీఆర్ హయాం నుంచి మొన్నటి కేసీఆర్ పాలన వరకూ మోరంచపల్లి వాసులకు వరద కష్టాలు తీరడం లేదు. గతంలో వరదలు నిండా ముంచినా ప్రభుత్వాలు గ్రామస్థులను ఆదుకున్న పాపాన పోలేదు. కనీసం పునరావాసం కల్పించేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు.

రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదు

నాలుగు రోజులు వర్షాలు పడి వరదలు వస్తున్నాయని తెలియడంతో రాత్రిళ్లు కంటి మీద కునుకులేదు. మొరంచవాగు ఉప్పొంగుతాందని మళ్లీ ఊర్లకు వరదలు వస్తాయని భయంభయంతో వెళ్లదీస్తున్నం. ఇప్పటికైతే బతికి బయటపడ్డం, మళ్లీ వానలు పడితే ఏం జరుగుతుందోననే భయం మాత్రం పోలేదు. 

 దొడ్డ సంతోష్ మోరంచపల్లి

గుర్తుకు వస్తేనే గుండెలు పగులుతానయ్ 

పోయిన ఏడాది వచ్చిన వరదల బీభత్సం గుర్తుకు వస్తేనే గుండెలు గుబేలు మంటున్నయ్. రాత్రికి రాత్రే ఊళ్లకు నీళ్లు వచ్చినయ్. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిండా ముంచాయి. ప్రాణాలు కాపాడుకు నేందుకు ఇండ్లపైకి ఎక్కినం. ఆస్తులన్నీ నీళ్ల పాలయ్యాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తే ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి. 

టా దోరం రాంరెడ్డి, రైతు మోరంచపల్లి