07-03-2025 12:40:45 AM
కరీంనగర్, మార్చి 6 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా విజయం తనదేనని స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. గురువారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నామినే షన్ వేసినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు తనకు ఫోన్ చేసి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అలాంటి ఒత్తిళ్లకు తలవంచకుండా పోటీలో ఉన్నానని తెలిపారు. దీంతో తన మీద కుట్రపూరితంగానే బిజెపి, కాంగ్రెస్‌లు ఓటర్లను ప్రలోభా ల గురిచేసి, డబ్బుతో వారి ఓట్లను కొనుగోలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ట్రస్మా సంఘం నేతలకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేసి తమకు పడే ఓట్లను వారి వైపుకు తిప్పుకున్నారని ఆరోపించారు.
జాతీయ పార్టీలను చెప్పుకొని ఓటుకు నోటు ఇచ్చి కొనడం సరైన పద్ధతి కాదని దీనికి ఎలక్షన్లు ఎందుకు నిర్వహించాలని ప్రభుత్వమే నేరుగా ఎమ్మె ల్సీ పదవులను అర్రస్ పెడితే కనీసం ప్రభుత్వానికి ఇంత డబ్బులను సమకూరుతాయి అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి గూగుల్ పే,ఫోన్ పే ల ద్వారా జరిగిన ట్రాన్సక్షన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా నైతిక విజయం మాదేనని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థి అంజి రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. తాను ప్రజల పక్షవాదినని ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు.