calender_icon.png 27 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీకి పూర్వ వైభవం?

30-08-2024 12:44:35 AM

  1. సర్కారు నిర్ణయంతో దశ మారేనా?
  2. ఆక్రమణలకు గురైన పరీవాహకం 
  3. పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం 
  4. అనంతగిరిని టూరిజం స్పాట్‌గా మార్చాలె

వికారాబాద్, ఆగష్టు 29(విజయక్రాంతి): కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ నది దశాబ్దాలుగా ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది.  కానీ నేడు మానవ తప్పిదాలతో మూసీ బోసిపోయింది. పచ్చని పొలాలతో కళకళలాడే మూసీ పరీవాహక ప్రాంతంలో ఇపుడు ఎక్కడా పచ్చని పొలాలు కనిపించడం లేదు. పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత నీటితో మూసీ పూర్తిగా మురికిగా మారింది.

గతంలో మూసీ పరీవాహక ప్రాంతంలో వేల కుటుంబాలు పంటలు సాగుచేసుకొని బతికేవారు. ఇప్పుడు ఆ పరీస్థితి లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాన్ని రెండు వైపులా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సిద్ధ్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే మూసీ పుట్టిన అనంతగిరితో పాటు మూసీ ప్రవహించే వాగుకు పూర్వ వైభవనం తీసుకరావాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. 

అనంతగిరిలో పుట్టిన మూసీ..

హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మూసీనది పుట్టింది. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మూసీనది  మొత్తం బేసిన్ వైశ్యాల్యం 4,329 చదరపు మైళ్లు. ఇది కృష్ణానది బేసిన్ వైల్యంలో 4.35 శాతం. ప్రారంభ స్థలంలో చిన్న వాగులా ప్రవహించే ఈ మూసీ నది వరదలు వచ్చినప్పుడు అనేక సార్లు బీభత్సం, జననష్టం, పంటనష్టం కలిగించింది. కొన్ని దశాబ్దాలుగా వరదలు పారడం లేదు. ఆశించిన స్థాయిలో పంటలు సాగు కావడం లేదు. ఒకప్పుడు వెడల్పుగా కనిపించిన మూసీ కాలక్రమేనా వరద మట్టితో, ముళ్ల పొదలతో నిండిపోయి చిన్నదిగా మారింది. మరికొన్ని చోట్ల ఆక్రమణలకు సైతం గురైంది. 

పారిశ్రామిక వ్యర్థాలతో మురికిగా..

 1980వ దశకం నుండి హైదరాబాద్ నగర శివారులోని పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడిన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మూసీ నదిలోకి వదలడం ప్రారంభం కావడంతో మూసీ ఒక మురికి కాలువగా మారింది. ప్రతిరోజు 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కలుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా హైదరాబాద్ సమీపంలో మూసీకి ప్రారంభమైన ముప్పు కాలం గడిచిన కొద్ది మూసీ పుట్టిన స్థలం వరకు వ్యాపించింది. 

మూసీ ప్రధానంగా ఇప్పటి వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట్, రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలాల గుండా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఈ రెండు మండలాల్లోనే అనేక గ్రామాల్లో మూసీ నది కింద పెద్దఎత్తున పంటలు సాగుచేసేవారు. ఇప్పుడు సాగు చేసేందుకు నీరు లేదు. ఒకప్పుడు విశాలంగా కనిపించిన మూసీ ఇప్పుడు చాలా చోట్ల ఆనవాళ్లు లేకుండా పోయింది. ప్రకృతిపరంగా అవతరించిన నది మానవ తప్పిదాలతో ఇలా కనుమరుగు అవుతుందనడానికి మూసీనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ప్రయోజనం లేని మూసీ..

 వికారాబాద్ ప్రాంతంలో పుట్టిన మూసీ వికారాబాద్ ప్రాంతంలోని పెద్ద ప్రయోజనం చేయకుండానే ప్రవహిస్తుంది. నవాబుపేట్ మండలంలో మూసీ 34 కి మీటర్ల మేరా పారుతోంది. శంకర్‌పల్లి మండలంలో దాదాపు 20 కి. మీ వరకు ప్రవహిస్తుంది. ఈ నది పారే పరీసర ప్రాంతాల్లోని అనుబంధ గ్రామాల్లో భూగర్భ జలాలు ఒకప్పుడు పుష్కలంగా ఉండేవి. ఈ మధ్యకాలంలో భూగర్భ జలాల శాతం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం నవాబుపేట్, శంకర్‌పల్లి పరీధిలోని కొన్ని గ్రామాల ప్రజలు మూసీ కింద కూరగాయలు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పుట్టుక స్థలం అనంతగిరితో పాటు, నవాబుపేట్, శంకర్‌పల్లి పరీధిలో పారే నదికి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు.