calender_icon.png 24 October, 2024 | 2:52 AM

మూసీ పునరుజ్జీవం.. సర్కారుపై బీజేపీ పోరు

24-10-2024 12:49:02 AM

  1. బాధితులకు అండగా కమలనాథులు 
  2. మూసీ పరీవాహక ప్రాంతంలో యాత్రలు
  3. రేపు ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా
  4. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపును పొందేందుకు బీజేపీ తహతహలాడుతోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు చూస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు..

కేడర్‌కు పెద్దగా అందుబాటులో లేకపోయినా పార్టీ వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 8 ఎంపీ సీట్లతో సత్తా చాటిన బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీన 24 గంటల పాటు రైతుదీక్ష నిరసన ద్వారా రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టిన బీజేపీ..

హైడ్రాపైనా తమదైన శైలిలో అధికార పార్టీని ఇరుకున పెట్టింది. ఇటీవల గ్రూప్ -1 అభ్యర్థుల ఆవేదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై బీజేపీ పైచేయికి ప్రయత్నించింది. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ ఆందోళనకు దిగింది.

ఈ నెల 22, 23, 24 తేదీల్లో మూసీ పరివాహక ప్రాంతంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ నెల 25న మూసీ కూల్చివేతల బాధితులతో కలిసి ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేయనున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. మూసీ ఆందోళన ద్వారా ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని కమలనాథులు గట్టి సందేశం ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు.

9 బృందాలు.. 18 ప్రాంతాలు..

మూసీ ప్రారంభమయ్యే రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నగరాన్ని వీడే ఎల్బీ నగర్ నియోజకవర్గం వరకు 9 నియోజకవర్గాల పరిధిలో 18 చోట్ల 9 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులతో సమావేశంపై వారి సమస్యలను తెలుసుకుంటున్నాయి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నేత ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.

మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని, కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలంటూ నేతలు పేర్కొంటున్నారు. మూసీ పరిధిలో బాధితులుగా మిగులుతారని లెక్క తేలిన 11 వేల మందికి తాము అండగా ఉంటామనే సందేశాన్ని బీజేపీ నేతలు ఇస్తున్నారు.

మూసీ అంశంలో బీఆర్‌ఎస్ పార్టీని కాదనే విధంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాల ద్వారా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద మూసీ బాధితులతో కలిసి చేసే మహా ధర్నా ద్వారా ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మూసీ బాధితులను భాగస్వామ్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ ఎన్నికలతో గత రెండు నెలలుగా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా లేని కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మూసీ మహా ధర్నాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇటీవల అశోక్‌నగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా చేపట్టిన కార్యక్రమంతో మంచి మైలేజీ సాధించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి వర్గం మూసీ ఆందోళనల ద్వారా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఏదో విధంగా బీజేపీ నేతలు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై పోరుకు ముందుకు రావడంపై పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.