calender_icon.png 20 October, 2024 | 1:32 PM

దోచుకోవడానికే మూసీ పునరుద్ధరణ

20-10-2024 01:57:08 AM

*25 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన పనులకు 1.50 లక్షల కోట్లు అవసరమా?

*బ్యూటిషికేషన్‌కు కాదు.. లూటిఫికేషన్‌కు బీఆర్‌ఎస్ వ్యతిరేకం

*బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు, 

*బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్‌లోని ఎస్టీపీ పరిశీలన

ఎల్బీనగర్, అక్టోబర్ 19: మూసీ బ్యూటిఫికేషన్‌కు బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సంపదను దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మూసీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ఆరోపించారు. నాగోల్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ని శనివారం స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. మూసీ సుందరీకరణకు రూ.25 వేల కోట్లు సరిపోతాయని, కానీ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కోసమే రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా 57 కిలోమీటర్ల మూసీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి బీఆర్‌ఎస్ హయాంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎల్బీనగర్ ఎమ్మెల్యేను చైర్మన్‌గా నియమించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

57 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూసీపై కొత్తగా 15 బ్రిడ్జిల నిర్మాణం, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తరలించి మూసీలో స్వచ్ఛమైన నీటిని పారించేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. 2023 మే నెలలో గోదావరి జలాలను మూసీకి తీసుకురావడానికి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. మూసీ మురుగునీటిని శుద్ధి చేయడానికి 32 ఎస్టీపీల నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నాగోల్‌లో అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించామని, గతంలో ఇక్కడ 120 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న ఎస్టీపీ ఉండగా.. బీఆర్‌ఎస్ హయాంలో 320 ఎంఎల్‌డీ సామర్థ్యానికి పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం నాగోల్ ఎస్టీపీ పనులు తుది దశకు చేరాయని అన్నారు.

మూసీ పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందే ప్రారంభించిందని.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు తానే చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పుడు అక్కరకు వచ్చాయా అని ప్రశ్నించారు. ఎస్టీపీలతో మురుగునీటి శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటిని పారించవచ్చని, మురుగు నీరు రాకుండా మూసీ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మింవచ్చని ప్రభుత్వానికి సూచించారు. అతి తక్కువ ఖర్చులో రూ.25 వేల కోట్లతో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఇచ్చిన ప్రజెంటేషన్ పచ్చి అబద్ధమని విమర్శించారు. మూసీ తీరంలో ఒక్క ఇల్లు కూల్చకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని బాధితులకు హామీ ఇచ్చారు.   

కాంగ్రెస్‌కు ఫండింగ్ కోసమే మూసీ పనులు

కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కోసమే మూసీ సుందరీకరణ పేరు మార్చి పునరుద్ధరణ పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే మూసీ మురికికూపంగా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి వెటకారం మాటలు ఆపి, ముందు మూసీకి వచ్చి ఇక్కడి ప్రజల మాటలు వినాలని సూచించారు. మొదటగా రూ.50 వేల కోట్లు అన్నారు.. తర్వాత రూ.70 వేల కోట్లు అన్నారు.. ఇప్పుడు రూ.1.50 లక్షలు కోట్లు అంటున్నారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వడానికి, రాహుల్ గాంధీ మెప్పు కోసమే మూసీ పునరుద్ధరణ అంటున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా మూసీ తీర ప్రాంతంలో ఉంటున్న ప్రజలను కబ్జాకోరులు, ఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డా రు.

సీఎం రేవంత్‌రెడ్డి మమ్మల్ని మూసీ వెంట మూడు నెలలు ఉండమని అంటున్నాడని,  ముందు అక్కడ 40 ఏళ్లుగా ఉంటున్న ప్రజలు మాకు ఇక్కడ ఏ ఇబ్బందులు లేవని చెబుతున్న మాటలు వినపడడం లేదా అని అన్నారు. నాకు మూసీ కొత్త కాదని.. లింబోలి అడ్డాలో మూడేళ్లు ఉన్నానని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీకి పైసలు.. నీ కుర్చీ కాపాడుకోవాలంటే మేము చందాలు ఇస్తాం.. మూసీ ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు. ప్రధాని మోదీ చేపడుతున్న నమామి గంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి 2,400 కిలోమీటర్ల దూరం సుందరీకరణకు రూ.40 కోట్లు సరిపోతాయంటున్నారని గుర్తు చేశారు.

ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 57 కిలోమీటర్లకు రూ.1.50 లక్షల కోట్లు అంటున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లను భయపెట్టి పైసలు గుంజడానికే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. నిధులు లేవు.. కేసీఆర్ అప్పులు చేశారని నిత్యం మొత్తుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ముందుగా బడుల్లో చాక్‌పీసులు ఇప్పించు అని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.