16-03-2025 12:23:43 AM
ఇంటి అలంకరణలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ ఇల్లు మోడ్రన్‌గా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు వింటేజ్ థీమ్‌ని ఎంచుకుంటుంటారు. అయితే ఎవరి ఇష్టాయిష్టాలెలా ఉన్నా.. బయోఫిలిక్ ఇంటీరియల్ ట్రెండ్ మాత్రం ఇటు ఆరోగ్యాన్నిస్తూనే, అటు మానసిక ప్రశాంతతను, సౌకర్యాన్ని సొంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం..
* ఇంటి డిజైనింగ్ కోసం వాడే అలంకరణ వస్తువులన్నీ పర్యావరణహితమైన ఉత్పత్తులతో తయారుచేయడం.. చెక్క, మట్టి, ఓక్ చెట్టు బెరడు, రాటెన్, ఉన్ని.. వంటి ప్రకృతి అందించే మెటీరియల్స్‌ని ఈ వస్తువుల తయారీలో ఉపయోగిస్తుంటారు డిజైనర్లు.
* బయోఫిలిక్ ఇంటీరియర్‌లో భాగంగా ఇలా గృహాలంకరణ వస్తువులే కాదు.. ఇంట్లోనే గోడకు లేదంటే ఓ మూలన చిన్నపాటి గార్డెన్‌లా పచ్చదనాన్ని ఏర్పాటుచేసుకోవడం, ప్రకృతి రమణీయతతో కూడిన ఆర్ట్‌వర్క్‌కి ఇంట్లో చోటివ్వడం.. వంటివీ దీని కిందకే వస్తాయి. ఈ తరహా ఫర్నిచర్ వస్తువులతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గి.. ప్రశాంతత చేకూరుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
* వెలుతురు కూడా మన మనసును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ సహజసిద్ధమైన లైటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది వేడిగా ఉందని, దుమ్ము వస్తుందని.. పగటి పూటే తలుపులు, కిటికీలు మూసేసి.. వెలుతురు కోసం లోపలి లైట్లను ఉపయోగిస్తుంటారు. కానీ పగటి పూట వచ్చే న్యాచురల్ లైటింగ్‌ని ఇలా అడ్డుకోకుండా పూర్తిగా ఆస్వాదించినప్పుడే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
* లివింగ్ రూమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటాం కాబట్టి ఈ గదిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటుచేసుకోవాలి. ఇక గోడలపై ఏర్పాటుచేసిన ఫొటో ఫ్రేములు, ఆర్ట్ వర్క్‌పై మినీ స్పాట్ లైట్లను ఏర్పాటుచేసుకుంటే గదికి అందమొస్తుంది.