calender_icon.png 21 October, 2024 | 8:38 PM

కథ: కోతి ముత్యాలహారం

29-06-2024 12:05:00 AM

ఒకరోజు రాజుగారు నడుస్తూ నడుస్తూ పెద్దతోటలోకి అడుగుపెట్టారు. ఆ ఉదయం వేళ తనతోపాటు మొత్తం కుటుంబం అక్కడి కొలనులో స్నానం చేస్తే బావుంటుందనిపించింది. అందరినీ తోటలో స్నానానికి రమ్మని రాజుగారు కబురు పంపారు. 

అందరూ తోటలో కొలను వద్దకు చేరారు. రాణి ఆమె పరివారము తమ మెడలోని నగలను వొడ్దునే ఉన్న సేవికుల వద్ద ఉంచారు. కొలను వొడ్డునే పెద్ద చెట్టు ఉంది. చిటారు కొమ్మన ఒక కోతి పిల్ల ఆకుల చాటున కూచొంది. రాణి తన నగలని, ముత్యాలహారాన్ని నగల పెట్టెలో పెట్టి సేవకురాలి వద్ద ఉంచింది. కోతిపిల్ల అది గమనించింది. సేవిక ఆదమరపుగా ఉన్నప్పుడు ఆ ముత్యాలహారాన్ని ఎత్తుకపోవాలని కోతి ఎదురుచూస్తోంది.

సేవిక ధ్యాసంతా నగలపెట్టె మీదే ఉంది. ఆ పెట్టెను చూస్తూ చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆమె. ఇంకేం కోతి పంట పండింది. చడీచప్పుడు కాకుండా చెట్టు దిగి, ముత్యాలహారం నోట కరుచుకుని చెట్టేక్కేసింది. ఆ ముత్యాలహారాన్ని మెళ్ళో వేసుకొని మురిసిపోయింది. తోట కాపలాదారులు చూస్తే గుంజుకుంటారని ఆ చెట్టు తొర్రలో భద్రంగా దాచింది. ఏమీ ఎరుగని దానిలా కూచింది. కాసేపటికి సేవకురాలికి మెలకువ వచ్చింది. చూస్తే నగలపెట్టెలో ముత్యాలహారం కనిపించలేదు. కంగారుపడి వెంటనే “రాణిగారి ముత్యాలహారం ఎవరో దొంగిలించి ఇటే పారిపోయారు” అంటూ పెద్దగా అరిచింది సేవిక. తోటలోని పనివాళ్ళు తోటంతా గాలించారు. ఎక్కడా ఏ ఆచూకీ దొరకలేదు. అసలేమి జరిగిందంటూ ఆరా తీశారు. నగలపెట్టె నా దగ్గరే పెట్టుకుని కూచున్నా. ఇక్కడి నుంచి ఎక్కడికీ కదల్లేదు. చల్లగాలికి కాస్తంత కునుకు పట్టింది. కాసేపటికి మెలకువొచ్చి చూసేసరికి నగలపెట్టెలో ముత్యాలహారం కనిపించలేదు అంటూ సేవిక అందరితో చెప్పింది. ముత్యాలహారం దొంగని పట్టుకోండని రాజు ఆజ్ఞాపించాడు. దొంగను పట్టుకోవడానికి నౌకర్లంతా తలోదిక్కు పరుగులు తీశారు. 

ఆ తోట వ్యవహారాలు చూసే మాలీ ఆలోచించాడు.. అంతా చిత్రంగా ఉందే! ముత్యాలహారం మాయమైంది తోటలోనే! తోటలోపల, బయట గట్టి కాపలా ఉంది. బయట నుంచి లోపలికిగానీ, లోపలి నుంచి బయటకుగానీ మా కన్నుగప్పి ఎవరూ పోయే వీలేలేదు. మరి ముత్యాలహారం ఎలా మాయమైందబ్బా! ఆలోచించగా తోటమాలికి తోటలోని కోతిమూకలు గుర్తొచ్చాయి. వాటిలో ఏదైనా ఆడకోతి ఈ ముత్యాలహారం మీద మనసుపడి ఎత్తుకెళ్ళిందేమో ననిపించింది.

తోటమాలికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రంగురంగుల గాజుపూసల హారాలు తెప్పించాడు. చీకటిపడగానే ఆ హారాలని అక్కడక్కడ చెట్టుకొమ్మలకి వేలాడదీయించాడు. తెల్లవారంగానే తళతళా మెరిసిపోతున్న ఆ గాజుపూసల హారాలు చూడగానే కోతిమూకలు వాటి మీదబడి తలా ఒకటి ఎత్తుకెళ్ళాయి. రాణిగారి ముత్యాలహారం ఎత్తుకెళ్ళిన కోతిపిల్ల చెట్టుదిగలేదు.. హారాన్ని భద్రంగా దాచిన చెట్టుతొర్ర వద్ద ఉండిపోయింది. మిగతా కోతులు కోతిపిల్లని ఆటపట్టించాయి. దాంతో చిర్రెత్తుకొచ్చిన కోతిపిల్ల చెట్టుతొర్రలోంచి ముత్యాలహారం తీసి మెడలో వేసుకుని చెట్టుదిగింది. మిగతా కోతుల వంక చూస్తూ ఆ కోతిపిల్ల గర్వంగా అంది “ఓసీ పిచ్చిమొహాల్లారా మీరు వేసుకుని ఊరేగుతున్నవి గాజుపూసలే. వాటికే తెగ మురిసిపోతున్నారు. ఇదిగో ఇటు చూడండి.. అసలు సిసలు ముత్యాలహారం అంటే ఇదీ” అంటూ తన మెడలో ముత్యాలహారం చూపించింది. ఇదంతా చెట్ల చాటునుండీ గమనించిన తోటమాలి వెంటనే కోతిపిల్లని పట్టేశాడు. దాన్ని తీసుకెళ్ళి రాజుగారి ముందు హాజరు పరిచాడు. “మహారాజా! రాణీగారి ముత్యాలహారం ఎత్తుకపోయింది ఈ కోతిపిల్లనే.” పోయిన హారం దొరికినందుకు రాజు చాలా సంతోషపడ్డాడు. ఆ ముత్యాలహారం ఎలా దొరికిందో చెప్పమన్నాడు. 

పూసగుచ్చినట్లుగా తోటమాలి రాజుగారికి మొత్తం కథ చెప్పాడు. ఈ తోటలోకి తనకి తెలియకుండా లోపలి నుంచి బయటకుగానీ, బయటనుంచి లోపలకు గానీ ఎవరూ పోలేరన్నాడు. ఇక మిగిలింది ఈ కోతిమూకనే. వాటినుంచి ఈ ముత్యాలహారం రాబట్టేందుకు తను వేసిన ఎత్తు వివరించాడు. “సరైన చోట సరైన వ్యక్తివి నువ్వు” అంటూ రాజు తోటమాలిని బాగా మెచ్చుకున్నాడు. 

 -పిల్లల కోసం తరతరాల కథలు పుస్తకం నుంచి