ఇప్పటికే ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు?
ఇతర ప్రసాదాలకు వినియోగించే పదార్థాలపైనా దృష్టి
యాదాద్రి భువనగిరి,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ తయారీలో నెయ్యి వినియోగంపై దుమారం చేలరేగుతున్న నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగిస్తున్న మదర్ డెయిరీ నెయ్యి నమూనాలను ఇప్పటికే పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆహార ఉత్పత్తుల నాణ్యత కేంద్రానికి పంపించినట్లు సమాచారం.
అలాగే ఇతర ప్రసాదాలకు వినియోగించే సరుకులు నాణ్యమైనవేనా? కల్తీ ఏమైనా ఉందా? అన్న కోణంలో అధికారులు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. ప్రసాదాల తయారీకి సాధారణంగా ఆలయానికి పిండి, చక్కెర, ఇదర సుగంధ ద్రవ్యాలను టెండర్లు ఆహ్వానిస్తారు. తక్కువ కోట్ చేసిన ఏజెన్సీలకు సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు.
ప్రస్తుతం నెయ్యి ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ (మదర్‌డెయిరీ) సరఫరా చేస్తోంది. రెండు జిల్లాల నుంచి పాలను సేకరించి పాల ఉత్పత్తులను తయారీ చేసే రైతు సహకార యూనియన్ (మదర్ డెయిరీ) సంప్రదింపుల ద్వారా సరఫరా జరుగుతోంది.
ప్రస్తుతం దేవస్థానం కిలో నెయ్యికి రూ.619 చొప్పున వెచ్చిస్తోంది. లడ్డూ తయారీకి ప్రతి నెలా ఆలయానికి సుమారు 20 వేల కిలోల నుంచి 22 వేల కిలోల వరకు నెయ్యి అవసరపడుతుంది. మదర్ డెయిరీ నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాల మేరకే ఉందని అధికారులు భావిస్తున్నారు.