calender_icon.png 16 January, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి సాయానికి వడ్డీ వ్యాపారులే దిక్కు!

07-07-2024 12:30:35 AM

  1. జూన్‌లో రైతు భరోసా జమ చేయని సర్కార్
  2. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో అన్నదాతకు అప్పుల తిప్పలు  
  3. రూ.౧౫ వేలు అనుకుంటే అసలుకే ఎసరు?

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రైతులు పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జూన్ గడిచినా ప్రభుత్వం వానకాలం సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం జమ చేయట్లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల కోసం రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పంటలు వేయగా, వాటికి ఎరువులు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఎరువుల కోసం మరోసారి అప్పులు చేయడం తలకు మించిన భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం భూమిలో పంట సాగు చేస్తే దున్నడం, విత్తనాలు, ఎరువులు, కూలీలు ఖర్చుతో కలుపుకొని దాదాపు రూ.౨౦ వేలు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. వందకు ౩ రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నట్టు వాపోతున్నారు. 

పథకానికి ఎసరు?

ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.7,500 రైతుల ఖాతాలో జమచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే రైతుభరోసాకే ఎగనామం పెట్టేలా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం జూన్ రెండో వారంలోనే రైతుబంధు నగదు ఖాతాల్లో జమ చేసేదని, దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత యాసంగి పెట్టుబడి పార్లమెంటు ఎన్నికల ముందు వేసింది. కనీసం వానకాలం పంటకు సయయానికి వేస్తారని అనుకుంటే నిజమైన లబ్ధిదారులను గుర్తించి అర్హులకే వేస్తామన్న ప్రకటనలతో కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు.

ప్రభుత్వం ఇటీవలే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి క్షేత్రస్ధాయిలో పర్యటన చేపట్టి వ్యవసాయం చేసే రైతులను గుర్తించి వేస్తామని పేర్కొనడం చూస్తూంటే ఆగస్టు తరువాతా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు 20 లక్షల ఎకరాల భూమి సాగు చేయడంలేదని, వాటిని రైతుబంధు జాబితా నుంచి తొలగించి 5 నుంచి 10 ఎకరాలలోపు వారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతుబంధు అందించే వరకు వానకాలం పంట చేతికొస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ గణాంకాలు చెప్తున్నాయి.

గత యాసంగిలో ప్రభుత్వం రైతుబంధు లెక్క ప్రకారం ఎకరంలోపు రైతులు 24,24,870 మంది ఉండగా వారి వద్ద 13.57 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అదే విధంగా 2 ఎకరాల్లోపు ఉన్న రైతులు 17,72,675 మంది ఉండగా వారి వద్ద 26.58 లక్షల ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాలలోపు రైతులు రాష్ట్రంలో 64,75,320 మంది ఉండగా, వారివద్ద 1,11,49,534 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరంతా దాదాపు వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే. ప్రభుత్వం పంట సాయం అందించకపోతే పండించిన పంట అప్పులు తీసుకొచ్చిన వడ్డీ వ్యాపారులకే చెల్లించే దుస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.