calender_icon.png 8 November, 2024 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతం సరిపోలేదు

10-08-2024 04:13:17 AM

  1. ప్రదర్శనపై చిన్న అసంతృప్తి
  2. భవిష్యత్తులో మళ్లీ స్వర్ణం సాధిస్తా
  3. నీరజ్‌కు శుభాకాంక్షల వెల్లువ

‘దేశానికి పతకం తీసుకొచ్చినందుకు సంతోషమే.. కానీ ఎక్కడో నా ప్రదర్శనపై చిన్న అసంతృప్తి.. జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకముంది’.. రజత పతకం మెడలో వేసుకున్న తర్వాత నీరజ్ నోటి నుంచి వచ్చిన మాటలు.. ఆ మాటల్లో ఏదో తెలియని వెలితి ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నప్పటికీ దేశానికి రెండో స్వర్ణం అందించలేకపోయాననే బాధ అతడి మొహంలో స్పష్టంగా కనిపించింది.. కానీ యావత్ భారతావని నీ ప్రదర్శన పట్ల గర్వపడుతోంది. భవిష్యత్తులో కచ్చితంగా దేశానికి మళ్లీ స్వర్ణం తీసుకొస్తావు.. నీపై మాకు అంత నమ్మకం. నీరజ్ చోప్రా.. నీ పేరు మా గుండెల్లో ఎప్పుడు పదిలంగానే ఉంటుంది.. 

విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్  నీరజ్ చోప్రా దేశానికి తొలి రజతం అందించి మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించాడు. గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే స్వర్ణం సాధించలేదన్న బాధ తప్పితే నీరజ్ ప్రదర్శనపై ఇసుమంతైనా అనుమానం అక్కర్లేదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్.. పారిస్‌లో మాత్రం దానిని రిపీట్ చేయలేకపోయాడు. 

కొంపముంచిన ఫౌల్స్..

ఈసారి ఒలింపిక్స్‌లో క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ ఒక్కసారి మాత్రమే జావెలిన్ విసిరాడు. 89.34 మీటర్లతో ఒలింపిక్స్‌లో తన బెస్ట్ నమోదు చేసుకున్నాడు. క్వాలిఫికేషన్‌లో తన బలం చూపించిన నీరజ్.. ఫైనల్లో అదే ప్రదర్శన చేయలేకపోయాడు. ఫైనల్ మొదలవ్వగానే 8వ స్థానంలో వచ్చిన నీరజ్ తొలిసారి ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో మాత్రం ఆత్మవిశ్వాసంతో ఈటెను విసరగా.. దాదాపు 90 మీటర్ల దూరంలో (89.45 మీటర్లు) పడింది. ఈ దూరాన్ని మరింత పెంచేస్తాడులే అనుకున్న తరుణంలో వరుస ఫౌల్స్ అతడి కొంపముంచాయి.

అప్పటికే పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సరికొత్త ఒలింపిక్స్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒత్తిడి కూడా నీరజ్‌పై పడినట్లు అనిపించింది. అందుకే వరుసగా నాలుగు ఫౌల్స్ చేశాడు. అదృష్టం బాగుండి నీరజ్ రెండో ప్రయత్నంలో వేసిన 89.45 మీటర్ల దూరాన్ని మిగిలిన అథ్లెట్లు ఎవరకు బ్రేక్ చేయలేకపోయారు. గ్రెనెడా స్టార్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్ల దూరంతో నీరజ్‌కు దగ్గరగా వచ్చినప్పటికీ అంతకుమించి వేయడంలో విఫలమయ్యాడు. కానీ పరిస్థితి ఏ మాత్రం వేరుగా ఉన్నా నీరజ్‌కు పతకం వచ్చేది కాదేమో.

అర్షద్ నా కొడుకుతో సమానం

భారత స్టార్ నీరజ్ చోప్రా రజతం సాధించడంపై అతడి తల్లి సరోజ్ దేవి సంతోషం వ్యక్తం చేసింది. తన కుమారుడు పతకం సాధించాడని తెలియగానే ఆనందంతో గంతులేసింది. ‘నా కుమారుడు రజత పతకం సాధించడం ఆనందంగా ఉంది. వాడు సాధించింది రజతమైనా నాకు బంగారంతో సమానం. నీరజ్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చాక అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా.

ఇక స్వర్ణం సాధించిన పాకిస్థాన్ కుర్రాడు అర్షద్ నదీమ్ నా కుమారుడితో సమానం. స్వర్ణం పతకం నెగ్గినందుకు అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు’ అని సరోజ్ దేవి పేర్కొంది. నీరజ్ విజయంపై తండ్రి సతీశ్ స్పందిస్తూ.. ‘దేశం కోసం సిల్వర్ గెలిచాడు. అతడి ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాం. గాయం తీవ్రత నీరజ్ ప్రదర్శనపై ప్రభావం చూపింది. లేకపోతే ఇంకా మెరుగైన ప్రదర్శన వచ్చేది’ అని తెలిపాడు. 

గర్వంగా ఉంది: ప్రధాని మోదీ

‘మరోసారి దేశం గర్వపడేలా చేశావు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నీపై ఉన్న నమ్మకంతో  ప్రజలు నీ ఆటను వీక్షించారు’ అని మోదీ వెల్లడించాడు. కాగా నీరజ్ తల్లి సరోజ్ దేవి వ్యాఖ్యలపై స్పందించిన మోదీ ఆమె చూపిన క్రీడాస్పూర్తిని కొనియాడారు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను మెచ్చుకుంటూ తన కుమారుడితో సమానమని సరోజ్ దేవి పేర్కొనడం సంతోషం కలిగించిందన్నారు. ఆమె వ్యాఖ్య లు క్రీడాస్పూర్తిని స్పురింపజేశాయని మోదీ తెలిపారు.