- హెచ్‌ఎండీఏలో సీఈ పోస్టు కోసం ఇద్దరు అధికారుల పోటీ
- త్వరలోనే డీపీసీ నిర్వహించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో కాసులు కురిపించే సీఈ కుర్చీ కోసం ఓ ఇద్దరు అధికారులు కుస్తీలు పడుతున్నారు. ఈ కుర్చీలో ఇప్పుడు ఇన్‌చార్జిగా కూర్చున్న ఓ అధికారి పర్మినెంట్‌గా తిష్ట వేసేందుకు పైరవీలు షురూ చేయగా, సీనియారిటీ జాబితాలో తనకే అర్హత ఉందని మరో అధికారి లాబీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అధికారులు కూడా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ, ఒకరి అవినీతిని మరొకరు తవ్వకుంటున్నారట. ఆ ఇద్దరు అధికారులు వ్యవహారం ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వంలో హెచ్‌ఎ ండీఏ సీఈగా విధులు నిర్వహించిన ఓ అధికారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ అధికారి స్థానంలో మరోఅధికారిని ప్రభుత్వం ఇన్‌చార్జి సీఈగా నియమించింది. అయితే ఇదే కుర్చీపై శాశ్వతంగా కూర్చోవాలని కంకణం కట్టుకున్న ఆ ఇన్‌చార్జి సీఈ, తనకు తెలిసిన అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ పెద్దల వరకు పైరవీలు షురూ చేశారు. తానేమి తక్కువ కాదన్నట్లుగా ప్రస్తుతం హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమి టెడ్)లో ఇన్‌చార్జి సీజీఎంగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి లాబీ మొదలుపెట్టారట. అంతేకాదు సీనియార్టీ ప్రకారం హెచ్‌ఎండీఏ సీఈ పోస్టు తనకే దక్కాలని బాహటంగానే చెబుతున్నాడట.
రెండు దశాబ్దాలుగా తిష్ట..
హెచ్‌ఎండీఏ సీఈ పోస్టు కోసం పోటీ పడుతున్న ఓ అధికారి హెచ్‌ఎండీఏలో గత 20 ఏండ్లుగా వివిధ హోదాల్లో పని చేసి ప్రతి అవినీతిలోనూ వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు తన అనుయాయులకు ఇప్పించి అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ చేపట్టే ప్రతి అభివృద్ధి ప్రాజెక్టులోనూ ఆ అధికారి మనుషులే ఉన్నారని, హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ విభాగంలో ఆ అధికారి ఎంత చెబితే అంతే అని హెచ్‌ఎండీఏ ఉద్యోగులు బాహటంగానే చర్చించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఇన్‌చార్జి సీఈగా ఉన్న అధికారి సీనియార్టీలో రెండోస్థానంలో ఉండగా, హెచ్‌జీసీఎల్ సీజీఎంగా పనిచేస్తున్న ఎస్‌ఈ స్థాయి అధికారి మొదటిస్థానంలో ఉన్నారు. అయితే ప్రభుత్వం అత్యంత కీలకమైన హెచ్‌ఎండీఏ సీఈ పోస్టును ఏ అధికారికి కట్టబెడుతుందో వేచి చూడాలి మరి.
డీపీసీ కోసం పట్టు..
హెచ్‌ఎండీఏ సీఈ పోస్టుతో పాటు హెచ్‌జీసీఎల్‌లోని మరో సీఈ పోస్టు ఖాళీగా ఉందని, ఈ రెండు పోస్టులకు కలిపి డీపీసీ(డిపార్ట్‌మెంట్ ప్రమోషన్స్ కమిటీ) నిర్వహించాలని ప్రస్తుత హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి సీఈ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారట. ఈ క్రమంలోనే ఈ రెండు సీఈ పోస్టులపై ఎంఏయూడీ ఉన్నతాధికారులు ఆరా తీయగా, హెచ్‌ఎండీఏలోని సీఈ పోస్టు మాత్రమే ఖాళీగా ఉందని, హెచ్‌జీసీఎల్‌లో సీఈ పోస్టు 2006లో అప్పటి అవసరాల నిమిత్తం నాటి ప్రభుత్వం నియమించినట్లు గుర్తించారు.
దీంతో ఉన్న ఒక్కగానొక్క హెచ్‌ఎండీఏ సీఈ కుర్చీపై ఖర్చీఫ్ వేసేందుకు ఆ ఇద్దరు అధికారులు నువ్వా, నేనా అన్నట్లుగా పైరవీలు షురూ చేయడంతో ఎంఏయూడీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారట. అయితే ప్రభు త్వం ఇటీవల ఓఆర్‌ఆర్ వరకు హెచ్‌ఎండీఏ విస్తరిస్తామని ప్రకటించడం తో, హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో జరిగే ప్రాజెక్టుల కోసం హెచ్‌ఎండీఏకు శా శ్వత సీఈని నియమించేందుకు ప్ర భుత్వం త్వరలోనే డీపీసీ నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సమాచారం.