07-03-2025 12:00:00 AM
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్టు చూపి లబ్ధి పొందుతున్న అక్రమార్కులు
9వేల మంది పన్ను చెల్లింపుదారులకు ఐటీశాఖ నోటీసులు
న్యూఢిల్లీ, మార్చి 6: ఎన్నికల సంఘం వద్ద నమోదై, ప్రస్తుతం ఉనికిలో లేని రాజకీయ పార్టీలకు రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందజేసిన 9 వేల మంది పన్ను చెల్లింపుదారులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశా రు. 2020 ఆర్థిక సంవత్సరంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు మనుగడలో లేని రాజకీయ పార్టీలకు చెక్కుల రూపంలో విరాళాలు అందజేసి, తిరిగి మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ చట్టంలోని 80జీజీబీ సెక్షన్ ప్రకారం రాజకీయ పార్టీలకు అందజేసే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తూ కొందరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఐటీ అధికారులు గుర్తించారు.
ఈ ప్రక్రియలో 1 కమిషన్‌ను వసూలు చేస్తూ దాతలకు రాజకీయ పార్టీలు సహకరిస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే అనుమానిత 9 వేల మంది పన్ను చెల్లింపుదారులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజకీయ పార్టీ తరఫున మిమ్మల్ని సంప్రదించింది ఎవరు? విరాళం పొందిన ఆ పార్టీ మీ నియోజకర్గంలో పోటీ చేసిందా? విరాళం ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సదరు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.
అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని బ్యాంకు అకౌంట్ల స్టేట్‌మెంట్లు, 2019 మధ్య కాలానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులు, విరాళాలు అందుకున్న పార్టీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. పార్టీలకు విరాళాలు అందజేసినట్టు చూపి ఐటీ రిటర్న్‌లు పొందిన పన్ను చెల్లింపుదారులు తాము విరాళాలు అందజేసినట్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిరూపించుకోకపోతే భారీ మూల్యం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.