త్రిపురనేని గోపీచంద్ నవంబర్ 2 వర్ధంతి
బాబ్జీ మద్రాసు పని వుండి వెళ్తుంటే అతని మూడేళ్ళ కొడుకు “నేనూ వస్తానని” ఏడ్చాడు. అతని భార్య, “పోనీ తీసుకువెళ్ళండి. చెన్నపట్టణం చూస్తాడు” అన్నది. అతనికైతే యే మాత్రం తీసుకు వెళ్దామని లేదు. కాని ఒక ప్రక్క వాడి ఏడుపూ ..., రెండో ప్రక్క భార్య సలహాతో అతనికి అంగీకరించక తప్పలేదు.
మద్రాసు వెళ్ళే బండి అతని వూరికి రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది. అతను పిల్లవాడికి భోజనం పెట్టించి, తాను భోజనం చేసి, ప్రయాణ సౌకర్యం కోసం వీలైనంత తక్కువ సామాను తీసుకొని యెనిమిది గంటలకల్లా స్టేషనుకి చేరాడు. ఆ రోజు బండి ఒక గంట ఆలస్యంగా చేరింది... ఈలోగా పిల్లవాడు ‘మారాం’ మొదలు పెట్టాడు.
కనుపించినవన్నీ కొనిపెట్టమన్నాడు. అప్పుడు భోజనం చేసి వచ్చి అమ్మేవాణ్ణి చూచి ‘తైరుసా దం’ పొట్లం కొనిపెట్టమన్నాడు. ఎంత చెప్పినా కొ నే వరకూ వినలేదు. కొన్న తర్వాత ‘నాకు అక్క ర్లే దు’ అన్నాడు. పారేసే వరకూ వినలేదు. చివరకు ఎలాగైతేనేం, రైలు వచ్చింది. బాబ్జ్జీ పిల్లవాణ్ణి తీసుకొని రెండో తరగతి పెట్టెలోకి యెక్కాడు. క్రింద ఒ క సీటు ఖాళీగా వుంది. పైన ఒక బెర్త్ ఖాళీగా వుం ది. పై బెర్త్ మీద ప్రక్క పరిచి, క్రింద ఖాళీగా వున్న సీటులో కొడుకుని పెట్టుకు కూర్చున్నాడు బాబ్జీ.
రైలు నాలుగయిదు స్టేషన్లు దాటింది. పెట్టెలో వాళ్లందరూ జోగుతున్నారు. పిల్లవాడి కళ్లు మూ తలు పడుతున్నై. బండి తెల్లవారి ఎప్పుడో జేరుకుంటుంది మద్రాసు. ‘పిల్లవాణ్ణి క్రింద సీట్లో పడు కోబెట్టి తాను పై బెర్త్ మీద పడుకుందాం’ అనుకొని, లేచి తాము కూర్చున్న ఖాళీలో దుప్పటి పరిచాడు బాబ్జీ.
“పడుకో బాబూ” అన్నాడు. నిద్ర అసలే కళ్ళమీదకు వచ్చి వుందేమో, పడుకోబెట్టీ పెట్టక ముందే నిద్ర పోయాడు పిల్లవాడు. బాబ్జీ తాను పరిచి వున్న పై బెర్త్ ఎక్కి పడుకున్నాడు.
***
ఒక రాత్రి వేళ అతనికి ఆ కస్మాత్తుగా మెళకువ వచ్చిం ది. ఎవ్వరో క్రింద నుంచి తన చొక్కా లాగుతున్నట్టు ఆనిపించింది. బరువు కళ్ళతో తొంగి చూశాడు. క్రింద సీటులో కూర్చుని వున్న పెద్దమనిషి తన కొడుకు పడుకొని వున్న సీటు వైపుకి చూపాడు. బాబ్జీ చూశాడు. ఆ సీటులో కొడుకు పడుకొని లేడు. పక్కమధ్య కూర్చొని, కుళ్ళికుళ్ళి యేడుస్తున్నాడు.
బాబ్జీ కళ్లు నలుపుకొని క్రిందకు దిగి పిల్లవాడి ప్రక్కకు జేరాడు.
“ఎందుకు ఏడుస్తున్నావ్?” అన్నాడు.
కొడుకు ఏడ్పు మానలేదు.
“నేను యిక్కడే వున్నాగా!” అన్నాడు.
కొడుకు ఏడుపు బిగబట్టటానికి ప్రయత్నించాడు.
“పడుకో. మా నాన్న కదూ” అని వాణ్ణి పడుకోబెట్టటానికి ప్రయత్నించాడు బాబ్జీ.
వాడు కళ్లు తుడుచుకుంటూ,
“అమ్మ కూలా నా దగ్గరలే పలుకునేది” అన్నాడు. అమ్మకూడా వాడి దగ్గరే పడుకునేదట. తను తన ప్రక్కనే పడుకోవాలని వాడి ఉద్దేశం. వాడు తన ఉద్దేశాన్ని బయట పెట్టిన రీతి కి, బాబ్జీకి నవ్వు వొచ్చింది.
“సరే, నేనూ నీ దగ్గరే పడుకుంటాను. పడుకో” అన్నాడు. కొడుకు పడుకున్నాడు. వాడి ప్రక్కనే పడుకున్నాడు బాబ్జీ.
రైలు చీకటిని చీల్చుకొని వెళ్తూ వుంది. పెట్టెలో వాళ్ళు ఎక్కడి వాళ్లు అక్కడే కునికిపాట్లు పడుతున్నారు. బాబ్జీకి కొడుకు ప్రక్కన పడుకోవటానికి చోటు చాల్లేదు. అయినా, ‘ఎక్కడ కదిలితే ఎక్కడ వాడు నిద్ర పోడో’ అనే భయం కొద్దీ బిగ పట్టుకొని అలాగే పడుకున్నాడు.
వొక స్టేషన్ వచ్చింది. పోయింది. ‘ఇక పరవాలేదు’ అనుకున్నాడు బాబ్జీ. కొడుకు నిద్రపోయాడు అనుకున్నాడు. మనస్సులో ఇక ఎప్పుడూ వాడితో ఇటువంటి సంబంధం పెట్టుకోగూడదని నిశ్చయించుకున్నాడు. కాని, ఇంతలో కొడుకు గాలి ఎగ పీలుస్తున్నట్టు అనుమానం వచ్చింది బాబ్జీకి. ప్రక్కకు తిరిగి చూశాడు. కొడుకు నిద్ర పోలేదు. వాడిలో వాడే ఎక్కెక్కి ఏడుస్తున్నాడు.
“ఏం బాబూ?”
వాడు పలక లేదు.
“నిద్ర పట్టటంలా?”
వాడు ఏడ్పు మానలేదు.
బాబ్జీకి విసుగు పుట్టింది. “పడుకో” అని కసురుకున్నాడు.
వాడు ఏడ్పు ఎక్కువ చేశాడు. పెట్టెలో ప్రయాణికులు ఎక్కడ లేచి నిద్రాభంగం అయినందుకు చీదరించు కుంటారో అని భయం వేసింది అతనికి.
“ఊరుకో బాబూ, ఊరుకో” అని కొడుకుని బ్రతిమాలాడు. వాడు కొంచం నెమ్మదించిం తర్వాత...
“ఏం బాబూ, నిద్ర రావటంలా?”
“వత్తా వుంది.”
“వస్తే మరి పడుకో” అన్నాడు.
“అమ్మా... ” మొదలుపెట్టాడు పిల్లవాడు.
“ఆఁ! అమ్మ..?” అడిగాడు బాబ్జీ.
“నన్ను పలుకోబెట్టి జోకొట్టి, జోల పాలేది...” అన్నాడు.
అమ్మ తన్ను పడుకోబెట్టి జోల పాడేదట! ఇవన్నీ తనను చెయ్యమంటాడు వాడు. పడుకో బెట్టవచ్చు, జో కొట్టనూ వచ్చు. కాని జోల పాడేది ఎట్లా? బాబ్జీకి కోపం ఎక్కువయింది. ఇంతలో కొడుకు ఏడుపు ఎక్కువ చేశాడు.
“పడుకో బాబూ, పడుకో” అన్నాడు బాబ్జీ. పడుకోబెట్టాడు. తాను పక్కన పడుకున్నాడు. జో కొట్టాడు. కాని, కొడుకు ఏడుపు మానలేదు.. జోల పాడటం ఒక్కటి మిగిలి వుందని బాబ్జీ గమనలో వుంది. కాని, ఎలా జోల పాడటం? తన భార్య పాడుతుండగా విన్నాడు గాని...
వెంటనే, ‘తాను మేలుకొని వుంటే తన భార్య సాకే సాకులు ఇంకేమి సాక మంటాడో’ అని భయం వేసింది బాబ్జీకి. వాణ్ణి నిద్ర పుచ్చటం తన ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు. ఒకసారి పెట్టె కలయ జూశాడు. అంతా నిద్ర పోతున్నారు. తనను నిద్ర నుంచి లేపిన పెద్దమనిషి కూడా కునుకుతున్నాడు. నెమ్మదిగా కూని రాగంలో మొదలుపెట్టాడు బాబ్జీ.
“జో అచ్చుతానంద జోజో ముకుందా! రార పరమానంద రామ గోవిందా!! జో జో..”
రచనా కాలం: 1 నవంబర్ 1973,
‘యువ’ మాసపత్రిక
‘కథా నిలయం’ సౌజన్యంతో..