calender_icon.png 4 October, 2024 | 4:52 AM

తేమ గండం

04-10-2024 02:51:14 AM

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అలసత్వం 

  1.  ప్రణాళిక అమలుకు మరో 40 రోజులు
  2. కోతలు మొదలు.. త్వరలో ధాన్యం సేకరణ 
  3. ఈ సీజన్‌లో 40 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు!
  4. అదంతా గోదాముల్లో నిల్వచేయాల్సిందే 
  5. ధాన్యంలో తేమ ౧౭ శాతం దాటితే ఎఫ్‌సీఐ నో
  6. తేమ పెరిగితే ధాన్యం రంగుమారే ప్రమాదం 
  7. 2022 రబీలో రంగుమారి ౩ వేల కోట్ల నష్టం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న ఏమాత్రం పాడుకాకుండా కాపాడుకొని అమ్ముకోవాలని చూస్తాడు. దానిని కొన్న వ్యాపారి కూడా మంచి నాణ్యతతో దాన్ని వినియోగదారుడికి అమ్ముకోవటానికి ప్రయత్ని స్తాడు.

అప్పుడే రైతుకైనా, వ్యాపారికైనా లాభం. మంచి లాభం రావాలంటే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. కానీ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేని తీరుతో భారీ నష్టమే జరిగే ప్రమాదం కనిపిస్తున్నది. 

కోతలు మొదలు..రాతలకే ప్రణాళిక

రాష్ట్రంలో వరికోతలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరించాలని ఒత్తిడి పెరుగుతున్నది. అతి త్వరలోనే కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది. కానీ, ధాన్యం సేకరించటం మొదలుపెడితే సీఎంఆర్ కోసం ఏ మిల్లర్‌కు ఎంత సరఫరా చేయాలనే లెక్కలు ఇంకా తేలలేదు. దీంతో ధాన్యం సేకరిస్తే కొంతకాలం దానిని గోదాముల్లోనే నిల్వ చేయాలి.

అక్కడే అసలు సమస్య మొదలు కాబోతున్నది. ప్రస్తుతం సేకరించనున్న సన్నవడ్లు గోదాముల్లో ఎక్కువకాలం నిల్వ ఉంటే రంగు మారుతాయి. బియ్యం నాణ్యత తగ్గుతాయి. దానివల్ల ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి కూడా రాదు. గతంలో ఇలాంటి అనుభవాలున్నాయి.  

తేమ పెరిగితే తిప్పలే

ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ౧౯౮౫లో నిబంధనలు రూపొందించింది. వాటి ప్రకా రం 17 శాతం లోపు మాయిశ్చర్ (తేమ) ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయా లి. అంతకన్నా ఎక్కువ తేమ శాతం ఉండటానికి వీలు లేదు. ఈ నిబంధన ప్రకారమే రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత 40 ఏండ్లుగా ఇవే నిబంధనలు అమల్లో ఉన్నాయి.

అయితే ఈ 40 ఏండ్లలో వడ్ల రకాల్లో అనేక మార్పులు సంభవించాయి. అప్పట్లో ఐఆర్ ముత్తు 1010 లాంటి గ్రేడ్ రకాలతోపాటు స్వర్ణ లాంటి కామన్ రకం వడ్లను రైతులు ఎక్కువగా పండించేవారు. ఈ రకాల గింజపై ఊకపొట్టు దళసరిగా (మందంగా) ఉండేది. దీనితో 17 శాతం తేమతో సేకరించిన ధాన్యం గోదాములో నిల్వ చేసినా ఎలాంటి నష్టం సంభవించేది కాదు. ధాన్యం రంగు మారేది కాదు.

వరి వంగడాల్లో ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి. ప్రస్తుతం బీపీటీ 5204, గంగాకావేరి, ఆర్‌ఎన్‌ఆర్ లాంటి సాధారణ రకాలను రైతులు అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఈ రకాల వడ్ల గింజపై ఊక పొట్టు సన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధన్యాన్ని 17 శాతం తేమతో కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేస్తే.. ధాన్యం రంగు మారే ప్రమాదం ఉంటుందని రైస్ మిల్లర్లతోపాటు నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖగానీ ప్రభుత్వంగానీ ఆలోచన చేయడం లేదు.

నిల్వ చేయాల్సిందే..

ఈ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రణాళిక ఇంకా తయారు కాలేదు. దానిని తయారుచేసి అమలుచేయటానికి ఎంతలేదన్నా ఇంకా ౩౦ నుంచి ౪౫ రోజులు పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆలోపు రైతులు పంట మొత్తం విక్రయించే అవకాశమూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేసినా ఆ ధాన్యాన్ని నేరుగా మిల్లులకు పంపేందుకు వీలు లేదు.

ఎందుకంటే మిల్లర్లకు సీఎంఆర్ కోసం ఎవరికి ఎంత సరఫరా చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదు. దీంతో అనివార్యంగా ధాన్యాన్ని గోదాములకే పంపాలి. దానిని తీరిగ్గా నెల తర్వాత మిల్లుకు పంపితే ఆలోగా ధాన్యం రంగుమారే ప్రమాదం ఉన్నది. ధాన్యం రంగు మారితే ఎఫ్‌సీఐ తీసుకోదు. అనివార్యంగా ౨౦౨౨ నాటి ధాన్యం లాగానే అడ్డికి పావుశేరు చొప్పున తక్కువ రేటుకు అమ్ము కోవాలి.

ఈసారి సన్నరకం ధాన్యం భారీగా వస్తుండటంతో ప్రభుత్వం సేకరించే మొత్తం కూడా భారీగానే ఉంటుంది. అంతమొత్తం రంగుమారితే వచ్చే నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పోనీ, ధాన్యాన్ని సేకరించ కుండా మమ అనిపిద్దామా అంటే కుదిరేలా లేదు. ప్రభుత్వం జనవరి 1 నుంచి రేషన్ కార్డుదారులకు, హాస్టళ్లు, గురుకులాలకు సన్నరకం బియ్యమే అందిస్తామని ప్రకటించింది.

అందుకోసం భారీగా సన్న వడ్లను కొనక తప్పదు. కానీ, ఇప్పటివరకు రైస్ మిల్లులతో పౌర సరఫరాల సంస్థ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. 25 శాతం బ్యాంకు గ్యారెంటీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇదంతా పూర్తయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సన్న రకానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను కూడా కలిపితే.. క్వింటాలు ధాన్యం రూ.2,805కు వస్తుంది.

సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినా రూ.11,220 కోట్లు అవుతుంది. ఇదంతా రంగు మారితే మళ్లీ క్వింటాల్ రూ.1,700లకో.. రూ.1,900లకో అమ్ముకోవాలి. దానివల్ల వచ్చే నష్టం రూ.వేల కోట్ల లోనే ఉంటుంది. ఈ నష్టం నివారించాలంటే ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పని గోదాముల్లో ధాన్యం నిల్వచేసినప్పుడు తేమ పెరిగి రంగుమారకుండా ఎలాంట చర్యలు చేపట్టాలో నిపుణులతో చర్చించి ఆ పనులు చేయటమే.

అన్నీ సన్న వడ్లే..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ప్రకటించిన వరికి రూ.౫౦౦ బోనస్ సన్నవడ్లకే పరిమితం చేయటంతో రాష్ట్రంలో ఈ వానకాలలో రైతులు గంపగుత్తగా సన్నరకాలే పండించారు.  వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ సుమారు 140 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని తెలుస్తుంది. సుమారు 100 నుంచి 110 లక్షల టన్నుల సన్నరకం వడ్లు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.

ఈ ధాన్యాన్ని సేకరించిన వెంటనే మిల్లులకు తరలించి బియ్యం గా మార్చకుండా గోదాముల్లో నిల్వచేస్తే రంగు మారటం ఖాయమని నిపు ణులు చెప్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వానికి వేలకోట్ల నష్టం తప్పదు. 2022 రబీలో కొనుగోలు చేసిన సుమారు 34 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం గోదాముల్లో నిల్వచేయడంతో రంగు మారి నాణ్యత తగ్గింది.

దీంతో క్వింటాలుకు రూ.2,600 పెట్టి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రూ.1,700 లకే విక్రయిస్తామని అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనిపై రాజకీయ దుమారం రేగటంతో వెనకడుగు వేసిం ది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రంగు మారిన ధాన్యాన్ని క్వింటాలు కు రూ.1,900లకు అమ్మేసింది.

ప్రభు త్వం ఈ ధాన్యాన్ని రూ.8,840 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేయగా, అమ్మి తే వచ్చింది రూ.6,460 కోట్లు మాత్ర మే. అంటే సర్కారుకు రూ. 2,380 కోట్ల నష్టం వచ్చింది. పైగా కొనుగోలు ఏర్పాట్ల ఖర్చు, రవాణా, హమాలీలు, అధికారులు, సిబ్బంది, గన్నీ బ్యాగులు.. ఇలా ఇతర రకాల ఖర్చులు కూడా నష్టపోయినట్టే. ఇదంతా పరిగణనలోకి తీసుకుంటే సుమారు రూ.3 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా.