calender_icon.png 5 March, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరమీదికి మొయినాబాద్ మార్కెట్!

05-03-2025 12:15:03 AM

  1. ఇటీవల మంత్రి తుమ్మలను కోరిన పార్టీ ఇంచార్జి భీమ్ భరత్
  2. మండలంలో 27,058 ఎకరాల సాగుభూమి
  3. ప్రస్తుతం సర్దార్‌నగర్ మార్కెట్ కిందే ఈ ప్రాంతం
  4. ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు

చేవెళ్ల, మార్చి 4 (విజయ క్రాంతి): హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం మొయినాబాద్. ఇక్కడ వ్యాపార, పారిశ్రామికంగా అభివృద్ధికి అవకాశాలు  ఉన్నప్పటికీ..  111 జీవో కారణంగా ముందుకు సాగడం లేదు.  కేవలం కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఫామ్ హౌస్ లు కట్టుకోవడం మినహా ...  రైతులందరికీ ఇప్పటికే వ్యవసాయమే ఆధారం. 

ముఖ్యంగా వరి, కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. కానీ, స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో గుడి మల్కాపూర్ లేదా శంషాబాద్ మార్కెట్లలో పంటలు విక్రయిస్తుంటారు.  వాస్తవానికి  మొయినాబాద్ మండలం  షాబాద్ మండలంలోని సర్దార్నగర్ మార్కెట్ కమిటీ పరిధిలోకి వస్తుంది. కానీ, ఈ ప్రాంతం దాదాపు షాద్ నగర్ కు దగ్గరగా ఉంటుంది. 

ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్యలు, టైం, ఖర్చు అధికం అవుతుండడంతో రైతులు స్థానికంగా వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేస్తున్నారు.  ఈ మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ ఇటీవల  సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు వినతి పత్రం అందించారు.

సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన ఆయన...  ఇది వరకే అడిగి ఉంటే ఈ పాటికే మంజూరయ్యేదని కూడా అనడం విశేషం.

వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా  

చేవెళ్ల నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే చేవెళ్ల, శంకర్పల్లి, నవాబుపేటలో సపరేట్ మార్కెట్లు , మొయినాబాద్, షాబాద్ మండలానికి కలిపి షాబాద్ మండలంలోని సర్దార్నగర్లో మార్కెట్ ఉంది.  మొయినాబాద్ మండలంలో ప్రస్తుతం 27,058 ఎకరాల సాగు భూమి ఉంది. 

రెండు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ రిజర్వాయర్లే కాదు...111 జీవో కింద ఫిక్స్ చేసిన 10 కిలోమీటర్ల క్యాచ్ మెంట్ ఏరియా కూడా ఈ మండలంలోనే ఎక్కువగా ఉంటుంది.   ఈ రిజర్వాయర్లకు వెళ్లే మూసీ, ఈసీ కూడా వాగులు కూడా ఈ మండలంలో నుంచే  వెళ్తుండడంతో భూగర్భ జలాలు పుష్కలం. 

దీంతో రైతులు బోర్ల కింద వరితో పాటు గులాబీ, చామంతి, చాందిని, బంతి, ఆస్ట్రల్ తదితర రకాల పూలు, కొత్తిమీర, పూదీన, పాల కూర, మెంతి, సుక్క కూర లాంటి ఆకుకూరలు, టమాట, వంకాయ, క్యాబేజీ, క్యాలి ప్లవర్ లాంటి కూరగాయలతో పాటు జామ, మామిడి పండ్లు కూడా పండిస్తున్నారు. 

అయినప్పటికీ  మార్కెట్ లేకపోవడంతో నగరానికి వెళ్లి  అమ్ముకోవాల్సి వస్తోంది.  వరి రైతులైతే  వడ్లను మిల్లుల వద్ద అమ్మేస్తుంటారు... లేదా మధ్యవర్తులే  అడ్డికి పావు శేరు లెక్కన రైతుల దగ్గర కొంటుంటారు.    

మార్కెట్ కమిటీ పదవులు కూడా కారణం

వ్యవసాయ మార్కెట్ తెరపైకి రావడానికి మార్కెట్ కమిటీ పదవులు కూడా కారణంగా తెలుస్తోంది.  సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సహా డైరెక్టర్ల పదువుల షాబాద్ మండలం వారికే ఎక్కువ దక్కుతున్నాయని స్థానిక నేతలు చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటి పాలకవర్గం విషయంలోనూ మొయినాబాద్ కు చెందిన సీనియర్ నేతలు పెదవి విరిచారు.   చైర్మన్ పదవి తమకే కేటాయించాలని డిమాండ్ చేసినా.. కొన్ని సమీకరణల దృష్ట్యా షాబాద్ మండలానికి చెందిన నేతకే దక్కింది. 

మార్కెట్ ఏర్పడితే రైతులకు మేలు చేయడంతో పాటు స్థానిక నేతలకు పదవులు దక్కే అవకాశం ఉండడంతో నియోజకవర్గ ఇన్ చార్జి పామెన భీమ్ భరత్ ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ఇప్పటికే  మంత్రి తుమ్మల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దష్టికి తీసుకెళ్లగా... అధికారులు  ఇప్పటికీ  చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.  

మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నం 

మొయినాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నం.  ఈ విషయాన్ని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్లినం.  ఆయన సానుకూలంగా స్పందించారు.  ఈ మేరకు చర్యలు కూడా మొదలయ్యాయి.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేతృత్వంలో త్వరలోనే మొయినాబాద్ రైతులకు తీపి కబురు అందిచనున్నం. 

 -- భీమ్ భరత్, 

కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి