21-02-2025 12:00:00 AM
‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ థియేటర్ బాట పట్టించాయి. 2013లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో ‘దృశ్యం 2’ తీశారు. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించింది. పలు భాషల్లో ఈ చిత్రాలను రీమేక్ చేసినా కూడా అక్కడ కూడా మంచి విజయం సొంతం చేసుకున్నాయి. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు.
ఇక్కడ కూడా ఈ చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా మోహన్‌లాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా మూడో భాగం ఉంటుందని.. అయితే అది పట్టాలెక్కేందుకు మూడు, నాలుగేళ్లు పడుతుందని గతంలో పలు సందర్భాల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. చెప్పినట్టుగానే ఇన్నాళ్లకు ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ విషయాన్ని మోహన్‌లాల్ వెల్లడిస్తూ.. ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు. ‘దృశ్యం 3’ రాబోతోంది అన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేశారు.