హైదరాబాద్,(విజయక్రాంతి): మంచు కుటుంబం మళ్లీ రచ్చకెక్కింది. మంచు ఫ్యామిలీలో ఆస్తుల తగాదాలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. సినీ నటుడు మంచు మోహన్ బాబు, తనయుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి(Rangareddy Collector C. Narayana Reddy) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన ఆస్తులను ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నా స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కులేదని, మనోజ్ తన ఆస్తులు తనకు అప్పగించాలని మోహన్ బాబు పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్ లోని జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం వద్ద ఈ వివాదం మొదలైంది. మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా, తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.