calender_icon.png 23 February, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహమ్మద్ యూనస్ ఒక ఉగ్రవాది

18-02-2025 11:09:38 PM

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు..

కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటా..

కోల్‌కతా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లా తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఒక ఉగ్రవాది అని ఆరోపించారు. మంగళవారం అవామీ లీగ్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమానికి షేక్ హసీనా వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. ‘దేశాన్ని నడపడంలో నాకు అనుభవం లేదని యూనస్ గతంలోనే అంగీకరించారు.

అన్ని విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై, అధికారులపై దాడులు చేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. పక్కా ప్రణాళికతోనే నా తండ్రి నివాసాన్ని ధ్వంసం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు కావొస్తున్నా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందే’ అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌కు తిరిగొస్తున్నా..

‘అప్పటివరకు అవామీ లీగ్ పార్టీ నాయకులు సహనం, ఓర్పు ప్రదర్శించండి. ప్రతీకారం తీర్చుకోవడానికి దేశానికి తిరిగొస్తున్నా. గతేడాది జూలైలో జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు పోలీసుల కాల్పుల్లో చావలేదు. పోస్టుమార్టం నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆందోళనల్లో అవామీ లీగ్ కార్యకర్తలు, మేధావులు, పోలీసులు, కళాకారులు హత్యకు గురైనప్పటికీ మహమ్మద్ యూనస్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.’ అని మండిపడ్డారు. అనంతరం ఇటీవలే ఆందోళనల్లో మృతి చెందిన పలువురు పోలీస్ అధికారుల కుటుంబాలతో షేక్ హసీనా వ్యక్తిగతంగా మాట్లాడారు.  గతేడాది ఆగస్టులో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కారణంగా పదవీచుత్యురాలైన హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.