ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ముంబై: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 14 నెలల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. శనివారం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
జనవరి 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా పనిచేసిన గిల్‌కు చోటు దక్కలేదు. రమన్‌దీప్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్ స్థానాల్లో నితీశ్ , షమీ, హర్షిత్ రానా తుది జట్టులోకి ఎంపికయ్యారు.ధ్రువ్ జురేల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది.
స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, వరుణ్, సుందర్‌లకు చాన్స్ ఇవ్వడం విశేషం. కాగా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు ఎన్‌సీఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో షమీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ సీనియర్ పేసర్ మంచి ప్రదర్శన చేశాడు.
షమీ చివరగా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న అనంతరం కోలుకున్న షమీ ముమ్మర సాధన చేశాడు.
భారత జట్టు
సూర్యకుమార్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సామ్సన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), అభిషేక్, తిలక్, హార్దిక్, రింకూ, నితీశ్, హర్షిత్, అర్ష్‌దీప్, షమీ, వరుణ్, రవి బిష్ణోయి, సుందర్.