calender_icon.png 29 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీవి కార్మిక వ్యతిరేక విధానాలు

29-11-2024 03:31:17 AM

కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేలా నిర్ణయాలు

సీపీఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్

నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పక్కా కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యు రాలు, మాజీ ఎంపీ బృందా కారత్ మండిపడ్డారు. నిర్మల్ పట్టణంలో గురువారం ఆమె పార్టీ నేతలతో కలిసి సీఐటీయూ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే, పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన మార్పులే చేయాల్సి ఉందని, కానీ, కేంద్రం కార్పోరేట్‌లకు కొమ్ముకాసే విధానాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు.

కేంద్రప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను బలహీన పరిచి, సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టెందుకు చట్టాలను మార్చాలని క్షమించరాని నేరమన్నారు. పేదలకోసం చట్టాలు మారిస్తే సీపీఎం కూడా స్వాగతిస్తుందన్నారు. పదేళ్ల మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో వెనుకబడిందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశానికి అంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఇప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలు, కార్మికులు కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు  అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వారికి మెరుగైన విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఆమె పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పర్యటనలో పార్టీ నాయకులు సీతారాములు, సాయిబాబా, భాస్కర్, బండారి రవికుమార్, మల్లేశ్, లంకా రాఘవులు, బండి దత్తాద్రి ఉన్నారు.