calender_icon.png 22 February, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చర్యలు దుర్మార్గం

21-02-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు

కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి 20 :ఆదాని కోసం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ చర్యలు దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఏఐటీయూసీ భవన్ లో గురువారం జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి కూనంనేని సాంబాశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అమెరికా వెళ్లి ట్రంపును కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిలిగా మారిందని,  కేవలం వ్యాపారస్తుల కోసం  వెళుతున్నాడే కానీ అమెరికాను భారతదేశ పౌరులను సంకెళ్లు వేసి పంపిస్తుంటే కనీసం ఖండించకుండా ట్రంప్ ని పొగడడం మోడీకే చెల్లిందని అన్నారు.

దేశంలో మోడీ మత రాజకీయాల వల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయని, కుటుంబ సభ్యులను కూడా విడదీసి పరిపాలన సాగిస్తున్నాడని ఇలా కేవలం తన పదవి  కోసం అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ కమ్యూనిస్టుల గురించి నిన్న మాట్లాడడం సిగ్గు చేటని, ఫామ్ హౌస్ లో ఉండి ప్రజాస్వామ్యం పై చిత్తశుద్ధి లేని కెసిఆర్ తన రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి గాని కమ్యూనిస్టుల గురించి మాట్లాడే హక్కు లేదని ముందుగా తనని ఎన్నుకున్న ప్రజల కోసం ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని అన్నారు.

రికిచెరువు పరిరక్షణకు చేసిన ఉద్యమం వల్ల హైడ్రాధికారులు చెరువును పరిరక్షించడానికి చర్యలు మొదలుపెట్టారని ఇవి సిపిఐ సాధించిన ఫలితాలని తెలిపారు. అనంతరం సిపిఐ పార్టీ పతాకాన్ని కార్యాలయం ఎదురుగా ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి.ఎస్.బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ యూసూఫ్,జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేసు రత్నం, జిల్లా సహాయ కార్యదర్శులు జీ.దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు హరినాధ్ రావు, స్వామి, శంకర్, వెంకట్ రెడ్డి, కల్లూరు ధర్మేంద్ర, జె.లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు సత్య ప్రసాద్, బాలరాజ్, శ్రీనివాస్, లొట్టి ఈశ్వర్, జయచంద్ర, లక్ష్మీ నారాయణ, సహదేవ్, నరేంద్ర ప్రసాద్, ప్రమీలా, మాధవి పాల్గొన్నారు.