- అత్యాచార నేరాలపై కఠిన చట్టాలు చేయండి
- ప్రధానికి బెంగాల్ సీఎం రెండో లేఖ
కోల్‌కతా, ఆగస్టు 30: కోల్‌కతా జూడాపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన వేళ ప్రధాని నరేంద్రమోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో లేఖ రాశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా దృఢమైన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా త్వరిగతిన కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని సూచించారు. ఇలాంటి సున్నిత అంశంపై లేఖ రాసినప్పుడు మీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, నేరుగా లేఖ రాసినా స్పందన లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
మోదీకి రాసిన లేఖకు గానూ కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మాత్రమే బదులు వచ్చిందని, సమస్య తీవ్రత దృష్ట్యా సాధారణ సమాధానం సరిపోదని రెండో లేఖలో మమత స్పష్టం చేశారు. వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో వారం రోజుల క్రిత మమత తొలిసారి ప్రధానికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందని, ఇలాంటి కేసుల్లో విచారణ 15 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మమత అభ్యర్థించారు.