అవసరమైతే 50శాతం దాటుతాయ్
రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు
కులగణన ఉద్దేశం ఒక ఉన్నత ఆశయం
కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారు
ఆధార్, ధరణి పాస్ బుక్, రేషన్ కార్డున్న దగ్గర సర్వే ఈజీ
అందరినీ సంప్రదించిన తర్వాతే కులగణన షెడ్యూల్ ఖరారు
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రెండు దశల్లో సర్వే..
సమగ్ర సర్వే రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు ప్రతి ఎన్యుమరేటర్ తన బ్లాక్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి అందులోని కుటుంబాలను నమోదు చేసి వారికి సంబంధించిన ఇంటి నంబర్, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేస్తారు. అనంతరం ఇంటికి స్టిక్కర్‌ను అతికిస్తారు. రెండో దేశలో నవంబర్ 9 నుంచి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఉంటుందని వివరించారు. క్షేత్రస్థాయిలో కులగణన పూర్తయిన తర్వాత మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరణ చేస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, మండలాల్లో నోడల్ అధికారిగా నియమించిన జిల్లా స్థాయి అధికారులు కంప్యూటరీకరణ చేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్టు ద్వారా సర్వే వాస్తవ పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
హైదరాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): తెలంగాణలో చేపడుతున్న కులగ ణన తర్వాత రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజ్వరేషన్లు సవరించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం జరిగిన మీటింగ్‌లో కూడా రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. అవసరమైతే 50శాతం రిజర్వేషన్లు దాటొచ్చని రాహుల్ అన్న మాటలను భట్టి ప్రస్తావించారు.
సమాజంలోని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే ఈ సర్వే ఉద్దేశమని వివరించారు. బుధవారం కులగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఉద్దేశం ఒక ఉన్నతమైన ఆశయమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మాదిరిగా తాము సర్వే వివరాలను దాచి పెట్టబోమని వివరించారు.
బీఆర్‌ఎస్ ఆ సర్వే ఎందుకు చేసింది? అందులో ఏముందో కూడా తెలియదన్నారు. కానీ తాము సర్వే వివరాలను సమగ్రంగా బయటపెడుతామని చెప్పారు. కులగణనలో వచ్చిన ఫలితాలను భట్టి తెలంగాణ సమాజం భవిష్యత్ నిర్మాణం ఉంటుందని వివరించారు. సమాజంలో చీలికలు తెచ్చే ఉద్దేశంతో సర్వే చేయడం లేదని స్పష్టం చేశారు.
కులగణనపై కుట్ర?
తెలంగాణ సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే దోచిపెడుతుందని బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం భట్టి తిప్పికొట్టారు. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ గత దశాబ్దకాలం పాటు బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామని చేస్తామని గొప్పలు చెప్పి, రూ.7లక్షల కోట్లపైగా అప్పులు చేసిఆర్థిక వ్యవస్థను విచ్చినం చేశాని శారని మండిపడ్డారు. వారి పాలనలో ప్రజలు భయభయంగా బతికే పరిస్థితులను తీసుకొచ్చి, 1947కు ముందు ఉన్న వ్యూడల్ వ్యవస్థను పునర్మించే ప్రయత్నం చేశారన్నారు.
అలాంటి వారు తమ ప్రభుత్వంపై విమర్శుల చేయడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని పేర్కొన్నారు. వారికి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలోని ఇతర వర్గాలకు ఫలాలను అందకుండా ఉండాలన్న ఆలోచనతోనే కులగణనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు..
సర్వేలో భాగంగా కుటుంబ నమోదు అనేది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సర్వేను కుటుంబాల ఆధారంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. సొంత ఊళ్ల నుంచి వలస వెళ్లిన వారు.. పనిచేసిన ప్రదేశంలో కూడా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సర్వే ఒక ఎక్స్ రే లాంటిదన్నారు. ఒక రోగికి ఎక్స్‌రే ఎలా ఉపయోగపడుతుందో.. సమాజానికి ఇది అలాగే దోహదపడుతుందని చెప్పారు. ఈ సర్వే రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను తొలగించడం కోసం కాదని స్పష్టం చేశారు.
ఇవి దగ్గర ఉంచుకోండి..
సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఎన్యుమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు ఆధార్, ధరణి పాస్‌బుక్, రేషన్ కార్డును దగ్గర ఉంచుకోవాలని భట్టి చెప్పారు. ఇవి సిద్ధంగా ఉంటే సర్వే త్వరగా పూర్తవుతుందని వెల్లడించారు. సమాజంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత సర్వేలో చేర్చాల్సిన ప్రశ్నావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సమాలోచనలు జరిపి షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.
మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారాన్ని సేకరించడం జరుగుతుందన్నారు. కులగణన కోసం ప్రైమరీ టీచర్లు, పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 నుంచి 175 ఇళ్లను సర్వే చేస్తారని తెలిపారు. 10మంది ఎన్యుమరేటర్లును పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్ ఉంటారన్నారు. సర్వేకు సంబంధించిన ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.