27-03-2025 12:27:30 AM
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : తెలంగాణ రైతులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బహిరంగ మార్కెట్లో పత్తికి సరైన ధరలు లభించని సందర్భంలో (2024--25) కనీస మద్దతు ధరలకే రూ. 15,556 కోట్ల విలువైన తెలంగాణ పత్తిని సేకరించి.. మరోసారి రైతుల పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
తెలంగాణలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 110 పత్తి సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసి 210 లక్షల క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం సేకరించిందని, ఫలితంగా 9 లక్షల తెలంగాణ పత్తిరైతులకు లాభం జరగిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోనే పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్న తెలంగాణలో 2014--15 పంట కాలం నుంచి 2024--25 పంట కాలం వరకు సీసీఐ ద్వారా రూ. 58 వేల కోట్లకు పైగా విలువైన పత్తిని మోదీ సర్కారు కనీస మద్దతు ధరకు సేకరించిందన్నారు.
2014--15 లో రూ. 3750 గా ఉన్న క్వింటాలు పత్తి కనీస మద్దతు ధర 2024--25 నాటికి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 7121 కి చేరిందన్నారు. ఇది పత్తిరైతులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన భరోసా అని తెలిపారు. భూసార పరీక్షలు మొదలుకొని విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, పంట రుణాలు, పంట బీమా, నీటిపారుదల సౌకర్యాలు, గిడ్డంగుల నిర్మాణం, కనీస మద్దతు ధరకే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు వ్యవసాయ రంగంలో అవసరమైన ప్రతీసారి మోదీ ప్రభుత్వం ప్రతి నిత్యం రైతులకు పూర్తిగా అండగా ఉంటోందన్నారు.